9న ఢిల్లీలో సీడబ్ల్యూసీ మీటింగ్‌

9న ఢిల్లీలో సీడబ్ల్యూసీ మీటింగ్‌
  • హాజ‌రుకానున్న స‌భ్యులు స‌హా 100 మంది
  • కుల గ‌ణ‌న‌, ఎన్నిక‌ల ఎజెండాపై విస్తృత చ‌ర్చ‌


విధాత‌: కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ (సీడబ్ల్యూసీ) ఈ నెల తొమ్మిదిన ఢిల్లీలో స‌మావేశం కానున్న‌ది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కుల గణన, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుస‌రించాల‌ని వ్యూహాన్ని స‌మావేశంలో చ‌ర్చించ‌నున్న‌ది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, తెలంగాణలో బీఆర్‌ఎస్, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్న‌ది. ఛ‌త్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని చూస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహ ర‌చ‌న‌పై చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై లోతుగా స‌మీక్ష జ‌రుపనున్న‌ది.


ఈ సమావేశంలో కుల గణనపై చర్చ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ కుల గణన కోసం బలంగా డిమాండ్ చేస్తున్న‌ది. ఇతర వెనుకబడిన తరగతులకు (OBC) ప్రాధాన్యం ఇస్తూ జనాభా ప్రాతిపదికన హక్కులు క‌ల్పించాల‌ని మొద‌టి నుంచి కాంగ్రెస్ కోరుతున్న‌ది. కొంతమంది విపక్ష నాయకులు ఈడీ దాడుల‌ను ఎదుర్కొంటున్న ఈ సమయంలో సీడబ్ల్యూసీ సమావేశం కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకున్న‌ది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ నేత‌ సంజయ్ సింగ్ అరెస్టు, విప‌క్ష నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని బీజేపీ స‌ర్కారు చేయిస్తున్న దాడుల‌ను ఖండించ‌డంతోపాటు విప‌క్ష నేత‌ల‌కు మ‌ద్ద‌తుగా ఉండాల‌ని నిర్ణ‌యించే అవ‌కాశం ఉన్న‌ది.


ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌స‌భ ఎన్నికల వ్యూహాన్ని రూపొందించేందుకు సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ మొదటి సమావేశం జరిగిన మూడు వారాల తర్వాత 9న ఢిల్లీలో మ‌ళ్లీ భేటీ కానున్న‌ది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు, హైదరాబాద్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చర్చలపై తదుపరి చర్యలను అనుసరించడానికి ఈ స‌మావేశం అవుతున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల ద్వారా తెలిసింది.


దేశ రాజధానిలో ఇది సీడ‌బ్ల్యూసీలో మొదటి సమావేశం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సీడ‌బ్ల్యూసీని ఆగస్టు 20న పునరుద్ధరించారు. పాత స‌భ్యుల‌ను అలాగే ఉంచి 84 మంది సభ్యుల‌కు (యువ‌త‌) చోటు కల్పించారు. సీడ‌బ్ల్యూసీలో 39 మంది సాధారణ సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 13 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. వీరిలో 15 మంది మహిళలు, పలువురు కొత్త వారు ఉన్నారు. 9న జ‌రిగే సమావేశానికి రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు.