కరెంటు కోతలపై కర్ణాటక రైతుల వినూత్న నిరసన

కరెంటు కోతలపై కర్ణాటక రైతుల వినూత్న నిరసన
  • మొసలితో సబ్ స్టేషన్ వద్ధ ధర్నా


విధాత : విద్యుత్తు కోతలపై కర్ణాటకలోని విజయపూర్ జిల్లా కొల్హారా తాలుకా రోనిహాల్ గ్రామ రైతులు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. హెస్కామ్ సబ్ స్టేషన్ కార్యాలయంలోకి మొసలిని తీసుకొచ్చి నిరసన తెలిపారు. మొసలితో రైతుల నిరసన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాత్రి పూట కరెంటు ఇస్తే పొలాలకు నీళ్లు ఎలా పెట్టుకోవాలని, చీకట్లో విష పురుగులు, జల చరాలతో ఇబ్బందులు పడుతున్నామంటూ వారు ధర్నా చేశారు.


రాత్రి పూట పొలంలో తిరుగుతున్న మొసలిని పట్టుకుని ట్రాక్టర్‌లో వేసుకుని సబ్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. తమకు పగటి పూట కరెంటు సరఫరా చేయాలంటూ డిమాండ్ చేశారు. నిరసనకు దిగిన రైతులను ఇటు విద్యుత్తు అధికారులు, అటు అటవీ శాఖ అధికారులు బుజ్జగించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నిరసన విరమింపచేశారు.