దొంగ‌ను ప‌ట్టించిన ప‌చ్చ‌బొట్టు

దొంగ‌ను ప‌ట్టించిన ప‌చ్చ‌బొట్టు
  • ఢిల్లీలోని ఈవెంట్ కార్యాల‌యంలో ముఠా దోపిడీ
  • సీసీటీవీలో రికార్డ‌యిన దొంగ‌ త్రిశూల్ టాటూ
  • దాని ఆధారంగా ద‌ర్యాప్తు… అదుపులోకి ముఠా


విధాత‌: ఆగ్నేయ ఢిల్లీలోని గోవింద్‌పురి ప్రాంతంలో ఇటీవ‌ల దోపిడీకి పాల్ప‌డిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ప్ర‌ధాన నిందితుడు త‌న ఎడమ ముంజేయిపై వేసుకున్న‌ ‘త్రిశూల్’ పచ్చబొట్టు ఆధారంగా అత‌డిని పోలీసులు గుర్తించారు. అత‌డితోపాటు ముగ్గురు ముఠా స‌భ్యుల‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపిన‌ట్టు గురువారం పోలీసులు వెల్ల‌డించారు.


పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. అక్టోబర్ 26న ఢిల్లీలోని ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ కార్యాలయంలోకి నలుగురు వ్యక్తులు ప్రవేశించి టాయ్ గన్‌చూపి మేనేజర్‌ని దోచుకున్నారు. కార్యాల‌యంలోని మ‌హిళ నుంచి మొబైల్ ఫోన్, రూ. 14,000 నగదు, రెండు బంగారు ఉంగరాలను దోచుకున్నారు. కార్యాల‌య నిర్వాహ‌కుడి కూడా కొట్టారు. ఈ మేర‌కు సంస్థ యజమాని నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేప‌ట్టారు.


నిందితుల్లో ఒకరి ఎడమ ముంజేయిపై ‘త్రిశూల్’ అనే పచ్చబొట్టు ఉందని ఫిర్యాదుదారు వెల్ల‌డించారు. నిందితులు నకిలీ నంబర్ ప్లేట్ ఉన్న కారును ఉపయోగించిన‌ట్టు ద‌ర్యాప్తులో తేలింది. సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించి నేరానికి ఉపయోగించిన కారును గుర్తించారు. ముంజేతిపై త్రిశూలం టాటూ వేయించుకున్న నిందితుడిని విపుల్ (36)గా గుర్తించారు. మహిపాల్‌పూర్‌ ప్రాంతంలోని ఓ హోటల్‌లో బస చేసిన విపుల్‌ని ప‌ట్టుకున్నారు. మిగిలిన నిందితులను జైవర్ధన్ (36), విజయ్ (34), సుమిత్ (30)గా గుర్తించారు. వీరంతా ఉత్తరప్రదేశ్‌లోని మోదీనగర్‌కు చెందినవారు. నేరానికి వాడిన‌ కారు, బొమ్మ పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


విపుల్‌తో సంబంధం కలిగి, ముఠా స‌భ్యురాలిగా ఉన్న మ‌హిళ ఫొటోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినందుకు సంస్థ యజమానిపై ప్రతీకారం తీర్చుకోవాలని విపుల్ ఈ దోపిడీకి పాల్ప‌డిన‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు. దొంగలకు సంస్థ కార్యాలయం, దాని ఉద్యోగుల గురించి అంతర్గత సమాచారం ఉన్న‌ద‌ని పేర్కొన్నారు.