హైదరాబాద్‌ నుంచి భారత్‌ గౌరవ్‌ రైలు..రూ.14వేలకే ఏడుక్షేత్రాల దర్శనం!

పలు ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనుకునే ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది

హైదరాబాద్‌ నుంచి భారత్‌ గౌరవ్‌ రైలు..రూ.14వేలకే ఏడుక్షేత్రాల దర్శనం!

Bharat Gaurav Train | పలు ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనుకునే ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్‌ నుంచి భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలులో యాత్రను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షియ యాత్ర’ పేరుతో ప్రత్యేకంగా ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా పర్యటన ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి భారత్‌ గౌరవ్‌ రైలులో ప్రయాణం మొదలవుతుంది. తమిళనాడు, కేరళలోని పర్యాటకలోని క్షేత్రాలను సందర్శించేందుకు అవకాశం ఉంటుంది. పర్యటనలో తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరులోని ఆలయాలను దర్శించుకోవచ్చు.

పర్యటన సాగేదిలా..

తొమ్మిది రోజులు.. ఎనిమిది రాత్రుల పాటు ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ్ యాత్ర’ కొనసాగుతుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్ర రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా కొనసాగుతున్నది. సికింద్రాబాద్‌తో పాటు కాజీపేట, వరంగల్ , ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రైలు ఆగుతుంది. రైలు 23న సిక్రిందాబాద్‌ రైల్వేస్టేషన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరుతుంది. తెల్లవారి ఉదయం 4.40 గంటలకు రేణిగుంట రైల్వేస్టేషన్‌కు చేరుతుంది. అక్కడి నుంచి తిరువణ్ణామలైకి 9గంటలకు రైలు చేరుతుంది. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్తారు. అరుణాచలంలో దర్శనాల తర్వాత మళ్లీ మధురైకి రైలులోనే బయలుదేరాల్సి ఉంటుంది. మూడోరోజు ఉదయం మధురైకి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రామేశ్వరం చేరుకుంటారు. ఇక్కడ ఆలయాలను దర్శించిన తర్వాత రాత్రి ఇక్కడే బస ఉంటుంది. నాలుగో రోజు ఉదయం మధురైకి చేరుకొని సాయంత్రం మీనాక్షి అమ్మవారి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత కన్యాకుమారికి బయలుదేరాల్సి ఉంటుంది. ఐదోరోజు ఉదయం 8 గంటలకు కన్యాకుమారికి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. నాగర్‌ కోయిల్‌లో బస చేస్తారు. ఆ తర్వాత త్రివేండ్రం బయలుదేరి వెళ్తారు. పద్మనాభస్వామి ఆలయం దర్శించుకోవడంతో పాటు కోవలం బీచ్‌కు వెళ్తారు. మళ్లీ కొచ్చివెల్లి స్టేషన్‌ చేరుకొని తిరుచిరాపల్లికి బయలుదేరుతారు. ఏడో రోజు ఉదయం తిరుచిరాపల్లికి చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీరంగం ఆలయానికి వెళ్తారు. అనంతరం తంజావూరు బృహదీశ్వరాలయానికి వెళ్తారు. అదే రోజు రాత్రి తిరిగి ప్రయాణమవుతారు. 9వ రోజు 2.30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో ప్రయాణం ముగుస్తుంది.

ఛార్జీలు ఇలా..

ఇక ఛార్జీల విషయానికి వస్తే ఎకానమీ కేటగిరీలో జీఎస్టీతో కలిపి డబుల్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరికి రూ.14,100 నిర్ణయించారు. స్టాండర్డ్ కేటగిరీ రూ.21,500, కంఫర్ట్ కేటగిరీ రూ.27,900గా టికెట్‌ ధరను నిర్ణయించారు. ఎకానమీ కేటగిరిలో స్లీపర్‌క్లాస్‌, స్టాండర్డ్‌ కేటగిరిలో థర్డ్‌ ఏసీ, కంఫర్ట్‌ కేటగిరిలో సెకండ్‌ ఏసీలో ప్రయాణం ఉంటుంది. ప్యాకేజీలో రైలు టికెట్‌, అల్పాహారం, డిన్నర్‌, హోటల్‌లో వసతి వర్తిస్తుంది. అలాగే, సైటింగ్‌ ఐఆర్‌సీటీసీ వాహనాల్లోనే ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్‌ సైతం కవరేజ్‌ ఉంటుంది. ఆసక్తి కలిగిన ప్రయాణికులు IRCTC వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని.. లేదంటే 9701360701 నంబర్‌లో సంప్రదించాలని ఐఆర్‌సీటీసీ కోరింది.