దేశం కోసం ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తా .. ఆజాద్ సమాజ్ పార్టీ (కన్షీరాం) నేత : చంద్రశేఖర్ ఆజాద్
దేశ ప్రజల కోసం పోరాడేందుకు పార్లమెంటులో ప్రతిపక్ష పాత్ర పోషిస్తానని ఆజాద్ సమాజ్ పార్టీ (కన్షీరాం) చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ చెప్పారు. బీజేపీని నిరోధించేందుకు తాను చేయాల్సిందంతా చేస్తానని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని నగీనా నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

నగీనా: దేశ ప్రజల కోసం పోరాడేందుకు పార్లమెంటులో ప్రతిపక్ష పాత్ర పోషిస్తానని ఆజాద్ సమాజ్ పార్టీ (కన్షీరాం) చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ చెప్పారు. బీజేపీని నిరోధించేందుకు తాను చేయాల్సిందంతా చేస్తానని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని నగీనా నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారి తన సొంత ప్రాంతమైన చుట్మల్‌పూర్‌కు ఆయన శుక్రవారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2022లో ప్రజలంతా ముఖ్యమంత్రిగా బెహన్జీ (బీఎస్పీ అధినేత్రి మాయావతి) అవ్వాలని కోరుకున్నారని, దాంతో తాను ఆ పార్టీ వెంట నిలిచి, ఖటౌలి, ఘోసి ఉప ఎన్నికల్లో బీజేపీని నిలువరించానని చెప్పారు. యూపీలో ఫలితాల నుంచి బీజేపీ గుణపాఠం నేర్చుకోవాలని అన్నారు. నియంతృత్వానికి ఇక కాలం చెల్లిందని చెప్పారు.
‘బీజేపీని నిలువరించడానికి ఏం చేయాలో అది పూర్తి శక్తిమంతంగా చేస్తాను’ అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 20కిపైగా సీట్లలో బీజేపీ గెలవకుండా ప్రజలు తమకు సహకరించారని ఆయన చంద్రశేఖర్ ఆజాద్ చెప్పారు.
‘నాపై దళితులు, ముస్లింలు, వెనుకబడిన వర్గాలవారు, రైతులు ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయబోను. బలహీన వర్గాలపై ఎక్కడ అణచివేత జరిగినా.. చంద్రశేఖర్ అక్కడ ఉంటాడు’ అని ఆయన ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ పనితీరు గురించి ప్రశ్నించగా.. ఈసారి ఆ పార్టీ ఏ ఎన్నికల్లోనూ గెలవడానికి పోటీ చేయడం లేదని వ్యాఖ్యానించారు. ‘నగీనాలో మేం పొత్తు పెట్టుకున్నాం. అటువంటి పొత్తు ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా కుదిరి ఉంటే.. 2027 ఎన్నికల్లో యూపీకి బీజేపీ పీడ వదిలించడంలో మమ్మల్ని ఎవరూ అడ్డుకునేవారు కాదు’ అని అన్నారు. చంద్రశేఖర్ ఆజాద్ వర్ధమాన దళిత నాయకుడు. దళిత రాజకీయాలపై బీఎస్పీ గుత్తాధిపత్యాన్ని ఆయన సవాలు చేస్తున్నారు.
‘దేశంలో అణగారిన వర్గాల కోసం పార్లమెంటులో నేను పోరాడుతాను. మా కార్యకర్తలు పార్లమెంటు వెలుపల ఆ పని చేస్తారు. ఇకపై మూక హత్యలు కానీ, ఏ పేదవాడినైనా ఎవరైనా కొట్టడానికి లేదు. ఇప్పటిదాకా అలాంటి ఘాతుకాలకు పాల్పడిన గూండాలు జాగ్రత్తగా ఉండాలి’ అని ఆయన హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా మాయావతి మేనల్లుడు ఆకాశ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. నేరుగా సమాధానం ఇవ్వడానికి నిరాకరించిన చంద్రశేఖర్.. అతడు తనకు సోదరుడిలాంటి వాడని చెప్పారు. డబ్బు బలం, కండబలం, వారసత్వం పేరుతో సాగే రాజకీయాలకు ఇక ముగింపు రానున్నదని అన్నారు.