వైరల్‌గా కేంద్ర మంత్రి తోమర్ కుమారుడి వీడియో.. చిక్కుల్లో బీజేపీ
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కుమారుడు దేవేంద్ర సింగ్ తోమర్ కొందరు వ్యాపారవేత్తలతో కోట్ల వ్యవహారం గురించి మాట్లాడుతున్నట్లు వెలువడిన వీడియోలు వైరల్ అవుతుండటం మధ్యప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది

విధాత: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కుమారుడు దేవేంద్ర సింగ్ తోమర్ కొందరు వ్యాపారవేత్తలతో కోట్ల వ్యవహారం గురించి మాట్లాడుతున్నట్లు వెలువడిన వీడియోలు వైరల్ అవుతుండటం మధ్యప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు దగ్గర పడుతున్న వేళ అధికార బీజేపీకి ఆ వీడియో ఇబ్బందికరంగా మారింది. దీంతో భాజపాపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుండగా, అటు అధికార పార్టీ బీజేపీ కూడా అవి ఫేక్ వీడియోలు అంటూ త్రిప్పి కొట్టడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ దిమిని అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన కుమారుడు దేవేంద్ర సింగ్ తోమర్ కొంతమంది మధ్యవర్తులతో మాట్లాడుతూ కోట్ల రూపాయల వ్యవహారం గురించి చర్చించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి . మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ గాంధీ ఇదే విషయాన్ని ప్రస్తావించి బీజేపీపై విమర్శల దాడి సాగించారు. బీజేపీ నేత బహిరంగంగా లంచం డిమాండ్ చేస్తున్నారని, ఈ వీడియో సాక్షంగా చూపిస్తుందని ఆరోపించారు. ఇప్పుడు తోమర్ కుమారుడిపై మోడీ ప్రభుత్వం ఈడీ, ఐటీ, సీబీబలను దాడులకు పంపుతుందా అని ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఈ వివాదంపై కేంద్రమంత్రి తోమర్ గ్వాలియర్ లో మాట్లాడుతూ బూటకపు చర్చలతో సమయాన్ని వృధా చేయకూడదు అంటూ వీడియో విషయాన్ని కొట్టి పారేశారు. అది ఫేక్ వీడియో అంటూ ఆయన బదులిచ్చారు. దానిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని కేంద్ర మంత్రి కుమారుడు దేవేంద్ర సింగ్ కూడా పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను అటు బీజేపీ కూడా ఖండించింది. ఆ వీడియో పై ఫిర్యాదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని పేర్కోంది. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 230 స్థానాలకు నవంబర్ 17న ఒకేరోజు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం పార్టీల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది.