“రక్తం మరుగుతోంది”.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

“రక్తం మరుగుతోంది”.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

విధాత: జమ్మూ కశ్మీర్ పహల్గామ్ లో 26మంది పర్యాటకులను కాల్చి చంపిన ఉగ్రవాదుల కిరాతక చర్యపై ప్రధాని మోడీ 121వ మన్ కీ బాత్ కార్యక్రమంంలో ప్రస్తావించారు. నా గుండెల్లో తీవ్ర బాధ ఉంది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద సంఘటన దేశంలోని ప్రతి పౌరుడిని బాధపెట్టింది. ఈ ఉగ్రవాద దాడి చిత్రాలను చూసిన తర్వాత ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోందని నాకు తెలుసు. పహల్గామ్‌లో జరిగిన ఈ దాడి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారి నిరాశను, వారి పిరికితనాన్ని చూపిస్తుంది. ఉగ్రవాదులు, దాని వెనుక ఉన్నవారు కశ్మీర్ మళ్ళీ నాశనం కావాలని కోరుకుంటున్నారు. అందుకే వారు ఇంత పెద్ద కుట్ర చేశారు. ఉగ్రవాదంపై జరుగుతున్న ఈ యుద్ధంలో దేశ ఐక్యత, 140 కోట్ల మంది భారతీయుల సంఘీభావం మనకు అతిపెద్ద బలం అని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.

మన్ కీ బాత్ కార్యక్రమంలో పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటన ప్రస్తావన

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన భయంకరమైన దాడిని మన్ కీ బాత్‌లో ప్రస్తావించిన మోదీ. బాధిత కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడికి ప్రగాఢ సానుభూతి ఉందని ఆయన అన్నారు. చనిపోయిన వారు ఏ రాష్ట్రానికి చెందిన వాడైనా, ఏ భాష మాట్లాడినా, ఈ దాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి బాధను అంతా అనుభవిస్తున్నారన్నారు.

శాంతి..ప్రగతిని సహించలేక దాడి

“కాశ్మీర్‌లో గత కొన్నేళ్ళ నుంచి పాఠశాలలు, కళాశాలు కళకళలాడుతున్నాయి. ప్రజాస్వామ్యం బలపడుతోంది. పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ప్రజల ఆదాయం పెరుగుతోంది. యువతకు కొత్త అవకాశాలు సృష్టించబడుతున్నాయి. ప్రజాస్వామ్యం బలపడుతోంది. తిరిగి శాంతియుత వాతావరణం కనిపించడంతో దేశ శత్రువులు, జమ్మూ కాశ్మీర్ శత్రువులు ఓర్వలేకపోయారు. మళ్లీ నాశనం చేయాలని పెద్ద కుట్రను అమలు చేశారు. ఈ ఉగ్ర దాడి తర్వాత దేశం మొత్తం ఒకే గొంతులో మాట్లాడుతుంది అని ప్రధాని అన్నారు. భారతదేశం ప్రజల్లో ఉన్న కోపం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఉగ్రవాదంపై జరుగుతున్న ఈ పోరులో దేశ ఐక్యత, 140 కోట్ల మంది భారతీయుల సంఘీభావమే అతిపెద్ద బలం. ఈ ఐక్యతే ఆధారం. దేశం ఈ సవాలును ఎదుర్కోవడానికి సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలి. ఒక్కటిగా మారి ప్రదర్శించాలన్నారు.

బాధితులకు న్యాయం చేస్తాం

ఈ ఉగ్రవాద దాడి తరువాత, ప్రపంచం నలుమూలల నుండి సంతాప సందేశాలు నిరంతరం వస్తున్నాయి. ప్రపంచ నాయకులు కూడా నాకు ఫోన్ చేశారు, లేఖలు రాశారు. ఈ హేయమైన ఉగ్రవాద దాడిని అందరూ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై మన పోరాటంలో 140 కోట్ల మంది భారతీయులకు ప్రపంచం అండగా నిలుస్తోంది. బాధిత కుటుంబాలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని మరోసారి హామీ ఇస్తున్నానని ప్రధానమంత్రి అన్నారు. ఈ దాడికి పాల్పడిన నిందితులకు, కుట్రదారులకు కఠినంగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఇలాంటి సమయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా, ధృడంగా ఉండాలని పిలుపునిచ్చారు.