11 గంటల వరకు మధ్యప్రదేశ్‌లో 28%, ఛత్తీస్‌గఢ్‌లో 20% ఓటింగ్

మధ్యప్రదేశ్, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శుక్ర‌వారం ఉద‌యం ఏడు గంట‌ల‌కు మొద‌లైంది. ఉద‌యం తొమ్మిది గంట‌ల వ‌ర‌కు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 11.13 శాతం, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 5.71 శాతం పోలింగ్ న‌మోదైంది

11 గంటల వరకు మధ్యప్రదేశ్‌లో 28%, ఛత్తీస్‌గఢ్‌లో 20% ఓటింగ్
  • అసెంబ్లీ ఎన్నికల‌కు కొన‌సాగుతున్న పోలింగ్‌
  • బూత్‌ల ఎదుట బారులుతీరిన ఓట‌ర్లు


విధాత‌: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా శుక్ర‌వారం మొదలైన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ ఎన్నిక‌ల్లో పోలింగ్ జోరందుకున్న‌ది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 9 గంటలకు 11.13 శాతం, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 5.71 శాతం పోలింగ్ జ‌రిగింది. ఉదయం 11 గంటల వరకు మధ్యప్రదేశ్‌లో 28.18 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 19.65 శాతం మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.


మధ్యప్రదేశ్‌లోని 230 స్థానాలకు ఒకేసారి, ఛత్తీస్‌గఢ్‌లో 70 స్థానాల‌కు రెండవ, చివరి దశ పోలింగ్ ప్రస్తుతం జరుగుతున్న‌ది. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలోని దిమాని అసెంబ్లీ నియోజకవర్గంలో శుక్రవారం ఉదయం రెండు గ్రూపుల మధ్య రాళ్ల దాడి చోటుచేసుకున్న‌ది. ఈ ఘ‌ట‌న‌లో ఒక వ్యక్తి గాయపడ్డారు.


ఛత్తీస్‌గఢ్‌లో పరిస్థితి ఏమిటి?


ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, ఆయన డిప్యూటీ టిఎస్ సింగ్ డియో, ఎనిమిది మంది రాష్ట్ర మంత్రులు, నలుగురు పార్లమెంటు సభ్యుల భవితవ్యాన్ని శుక్ర‌వారం నాటి పోలింగ్ నిర్ణయించనున్న‌ది. నవంబర్ 7న 20 స్థానాలకు జరిగిన తొలి దశ ఎన్నికల్లో 78 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రధాన పోరు ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఉన్న‌ది. మాజీ సీఎం అజిత్‌ జోగి పార్టీ, బీఎస్పీల ప్రభావం ఉన్న బిలాస్‌పూర్‌ డివిజన్‌లోని పలు స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొన్న‌ది.


మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాల‌కు శుక్ర‌వారం ఒకేరోజు ఒకేద‌ఫాలో పోలింగ్ జ‌రుగుతున్న‌ది. ఛత్తీస్‌గఢ్‌లో 70 స్థానాల‌కు చివరి ద‌శ పోలింగ్ కూడా శుక్ర‌వార‌మే జ‌రుగుతున్న‌ది. ఛత్తీస్‌గఢ్‌లోని 20 అసెంబ్లీ నియోజకవర్గాల‌కు ఇప్పటికే నవంబర్ 7న పోలింగ్ జ‌రిగింది. మిలిగిన 70 స్థానాల‌కు శుక్ర‌వారం ఓటింగ్ జ‌రుగుతున్న‌ది. ఉద‌యం ఏడు గంట‌ల‌కు మొద‌లైన పోలింగ్ సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నున్న‌ది.


రెండు రాష్ట్రాల్లో కూడా ప్ర‌ధాన పార్టీల‌ అభ్య‌ర్థులు త‌మ ఓటు హ‌క్కు తొలి రెండు గంట‌ల్లోపే వినియోగించుకున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ త‌న స్వ‌గ్రామంలో కుటుంబంతోస‌హా ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు వీడీ శ‌ర్మ భోపాల్‌లో ఓటు వేశారు. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాల్లో 2,533 మంది అభ్యర్థులు బ‌రిలో నిలిచారు.