ఐ ఫోన్‌ను దొంగిలించిన కోతి.. డీల్ కుదిరాక ఏం చేసిందంటే..?
కోతులు చాలా హుషార్.. ఉన్నట్టుండి కళ్లు మూసి తెరిచే లోపే వస్తువులను ఎత్తుకెళ్తుంటాయి.

కోతులు చాలా హుషార్.. ఉన్నట్టుండి కళ్లు మూసి తెరిచే లోపే వస్తువులను ఎత్తుకెళ్తుంటాయి. ఆ తర్వాత వాటిని ఇవ్వకుండా కోతులు సతాయిస్తుంటాయి. చివరకు కోతులను ఒప్పించి, మెప్పించి మన వస్తువులను మనం రాబట్టుకుంటాం. అయితే ఓ కోతి ఏకంగా ఐ ఫోన్‌ను ఎత్తుకెళ్లింది. చివరకు డీల్ కుదిరాక ఆ ఫోన్‌ను నేలపైకి పడేసింది కోతి.
ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో కోతులు ఎక్కువ. అక్కడకు వెళ్లిన ఓ పర్యాటకుడి ఐ ఫోన్‌ను ఓ కోతి ఎత్తుకెళ్లింది. అనంతరం అక్కడున్న ఓ భవనంపై కోతి ఫోన్‌తో కూర్చుంది. ఆ ఫోన్‌ను ఎలాగైనా కాపాడుకోవాలని నిర్ణయించుకున్న పర్యాటకుడు.. శతవిధాలా ప్రయత్నించాడు. అక్కడ భారీగా జనాలు గుమిగూడారు. అయినప్పటికీ కోతి ఫోన్‌ను వదిలిపెట్టలేదు.
చివరకు ఓ ఫ్రూటీ డబ్బాను కోతికి విసిరేయగా, అది కూడా ఐ ఫోన్‌ను కిందకు విసిరేసింది. ఫ్రూటీ డబ్బాను కోతి తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయింది. కోతి నేలపైకి విసిరిన ఫోన్‌ను అతను కిందపడకుండా పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన జనవరి 6వ తేదీన బృందావన్‌లోని శ్రీ రంగనాథ్ మందిర్‌లో చోటు చేసుకుంది.