సెల్‌ఫోన్ టార్చ్‌తో డెలివరీ.. తల్లీబిడ్డ మృతి
ఓ గర్భిణి మహిళకు సెల్‌ఫోన్ టార్చ్‌తో డెలివరీ చేశారు వైద్యులు. సీజేరియన్ పూర్తయిన కాసేపటికే తల్లీబిడ్డ మృతి చెందారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో సోమవారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.

ముంబై : ఓ గర్భిణి మహిళకు సెల్‌ఫోన్ టార్చ్‌తో డెలివరీ చేశారు వైద్యులు. సీజేరియన్ పూర్తయిన కాసేపటికే తల్లీబిడ్డ మృతి చెందారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో సోమవారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబైకు చెందిన ఖుస్రుద్దీన్ అన్సారీకి 11 నెలల క్రితం వివాహమైంది. అన్సారీ భార్య షాహీదున్(26)కు నెలలు నిండడంతో చికిత్స నిమిత్తం ఏప్రిల్ 29న ఉదయం 7 గంటలకు సుష్మా స్వరాజ్ మెటర్నిటీ హోంకు తరలించారు. అయితే ఆమె ఆరోగ్యంగా ఉందని, నార్మల్ డెలివరీ చేస్తామని కుటుంబ సభ్యులకు వైద్యులు చెప్పారు. షాహీదున్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సెల్ ఫోన్ టార్చ్ సహాయంతోనే నార్మల్ డెలివరీకి బదులుగా సీజేరియన్ చేశారు.
పసిబిడ్డ క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోగా, షాహీదున్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మెరుగైన చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఆ హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత కారణంగా చనిపోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తల్లీబిడ్డ మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.