Terror Camps again in Pak | చెంపదెబ్బ తిన్నా.. బుద్ధిమారని పాకిస్తాన్
ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్-పాక్ మధ్య మరోసారి కాల్పుల విరమణకు ఒప్పందం కుదరినా… ఇప్పుడు పాకిస్తాన్ తిరిగి అదే పాత మార్గాన్ని అనుసరించడం గమనార్హం. భారత మిలిటరీ, ఇంటలిజెన్స్ వ్యవస్థలు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మళ్లీ ఏర్పడింది.

- తిండికి లేకపోయినా తీవ్రవాదానికి ఊతం
- ఆపరేషన్ సిందూర్ తరువాత ఉగ్ర శిబిరాల పునఃనిర్మాణం
- కాల్పుల విరమణకు ఒప్పుకుని తప్పుచేసిన భారత్
Terror Camps again in Pak | ఆపరేషన్ సిందూర్‌లో భారత్ నిర్వహించిన తీవ్ర దాడుల అనంతరం పాకిస్తాన్ మళ్లీ తన ఉగ్రశిబిరాల పునర్నిర్మాణాన్ని ప్రారంభించిందని రహస్య సమాచారం వెల్లడిస్తోంది. మేలో భారత్ చేసిన అత్యంత ఖచ్చితమైన వైమానిక దాడుల సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రాంతంలోని పలు శిబిరాలు ధ్వంసమయ్యాయి. అయితే ఇప్పుడు పాక్ ఆర్మీ, ISI, ప్రభుత్వ సహకారంతో కొత్తగా ఇవే శిబిరాలు తిరిగి నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమం ఖచ్చితమైన ప్రణాళికతో, ఉగ్రతత్వాన్ని కొనసాగించే సంకల్పంతో కొనసాగుతోంది.
భారత గూఢచార సంస్థల విశ్లేషణల ప్రకారం, తాజాగా నిర్మించబడుతున్న శిబిరాలు అధునాతన సాంకేతికతతో కూడినవి. ఇవి ప్రధానంగా లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్నాయి. శాటిలైట్‌లు, డ్రోన్ల పర్యవేక్షణకు చిక్కకుండా ఉండేందుకు వీటినిదట్టమైన అడవుల మధ్యలో ఏర్పాటు చేస్తున్నారు. పాక్ సైన్యం ప్రత్యేక విభాగాల ఆధ్వర్యంలో ఈ శిబిరాలకు భద్రత కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. థర్మల్ సెన్సార్లు, తక్కువ ఫ్రీక్వెన్సీ రాడార్‌లు, డ్రోన్ కౌంటర్‌మెజర్లతో సాయుధ గార్డులు వీటిని కాపాడుతున్నారు.
అయితే గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకు, ఈసారి ఐఎస్ఐ బాగానే పన్నాగం వేసింది. పెద్ద శిబిరాలను ఇప్పుడు చిన్నచిన్న శిబిరాలుగా విభజన చేసింది. ఒక్కో శిబిరంలో 200 మందికి మించి ఉగ్రవాదులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ చిన్న శిబిరాలు(Small Camps) దాదాపు 20 ప్రదేశాల్లో నూతనంగా నిర్మాణంలో ఉన్నాయి. కేల్, సర్దీ, అఠ్ముకాం, జూరా, లిపా, కహుటా, కోట్లీ, ఖుయిరట్టా, చమన్‌కోట్, జంకోట్ వంటి ప్రాంతాలు వీటిలో ప్రముఖమైనవి. గతంలో ధ్వంసమైన లునీ, పుట్వాల్, చాప్రార్ ఫార్వర్డ్, జంగ్లోరా వంటి ప్రాంతాల్లోనూ పునఃనిర్మాణం(Reconstruction) జరుగుతోంది.
ఇక బహావల్పూర్(Bahawalpur)లో ఇటీవల జరిగిన ఒక రహస్య సమావేశాన్ని కూడా భారత నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ సమావేశానికి జైష్-ఎ-మొహమ్మద్(JeM), లష్కరే-తోయిబా(LeT), హిజ్బుల్ ముజాహిదీన్(HM), టెర్రరిస్ట్ రెసిస్టెన్స్ ఫ్రంట్(TRF) వంటి ఉగ్రవాద సంస్థల నేతలు హాజరయ్యారు. ఐఎస్ఐ ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొన్నట్లు సమాచారం. ఇందులో ముఖ్యంగా కొత్త కమాండ్ శ్రేణుల ఏర్పాటు, మళ్లీ శిక్షణా శిబిరాల నిర్మాణం, పాక్, కశ్మీర్ ప్రాంతాల్లో నియామకాలపై చర్చించారని తెలుస్తోంది. బహావల్పూర్ జైష్ ఉగ్రసంస్థకు కేంద్రంగా ఉండటంతో అక్కడ నిర్వహించిన ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఒకవైపు అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్, మరోవైపు ప్రపంచ బ్యాంకు(World Bank), ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(Asia Development Bank)ల నుండి వచ్చిన నిధులను కూడా ఈ ఉగ్ర శిబిరాల నిర్మాణానికి మళ్లిస్తున్నదని భారత రహస్య సంస్థలు పేర్కొంటున్నాయి. ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం. అందుకే భారత్ అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది.
ఇదిలా ఉండగా, ఆపరేషన్ సిందూర్ వివరాలను పరిశీలిస్తే.. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పౌరులు మృతిచెందిన తర్వాత భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవాలనే దృఢనిశ్చయంతో ఈ ఆపరేషన్ ప్రారంభించింది. మే 6వ తేదీ నుండి నాలుగు రోజులపాటు జరిగిన ఈ సర్జికల్ దాడుల్లో భారత వైమానిక దళం కీలకపాత్ర పోషించింది. చైనా నుంచి పాక్‌కు వచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ముందుగానే అడ్డుకుని, 23 నిమిషాల్లో లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు జరిపింది. ఇస్రో ఉపగ్రహాల సహాయంతో ఉగ్రవాద స్థావరాలపై స్పష్టమైన సమాచారాన్ని సేకరించి, ఆయా టార్గెట్లను గుర్తించి, అధునాతన ఆయుధాలతో పక్కాగా గురిచూసి దాడి నిర్వహించారు. మురిద్కేలోని మర్కజ్ తాయిబా, బహావల్పూర్‌లోని మర్కజ్ సుభాన్ అల్లా వంటి ప్రముఖ శిక్షణా కేంద్రాలను ధ్వంసం చేశారు. సుమారు 9 ప్రధాన స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఈ ఆపరేషన్ అనంతరం భారత్-పాక్ మధ్య మరోసారి కాల్పుల విరమణకు ఒప్పందం కుదరినా… ఇప్పుడు పాకిస్తాన్ తిరిగి అదే పాత మార్గాన్ని అనుసరించడం గమనార్హం. భారత మిలిటరీ, ఇంటలిజెన్స్ వ్యవస్థలు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మళ్లీ ఏర్పడింది. పాక్‌కు అంతర్గతంగా ఉన్న అస్థిరతను దాచే ప్రయత్నంలో, ఉగ్రవాదాన్ని మళ్లీ ప్రోత్సహించడం వాస్తవానికి తీవ్ర ప్రమాదాన్ని కొని తెస్తోంది. తానే యుద్ధాన్ని ఆపానంటూ పదేపదే అదే పాట పాడుతున్న అమెరికా అధ్యక్షుడి(Donald Trump)కి ఈ విషయాలేవీ తెలియకుండా ఉండవు. అయినా, ఆయన పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్(Asif Munir)ను పిలిచి మరీ వైట్‌హౌస్‌లో విందు ఏర్పాటు చేసాడు. మునీర్‌ను గొప్ప నాయకుడిగా కీర్తించాడు. మరోవైపు భారత్‌ను పొగుడుతూనే దాగుడుమూతలు ఆడుతున్న ట్రంప్‌ను భారత్ పాకిస్తాన్ విషయంలో లెక్కపెట్టాల్సిన అవసరం లేదు. ఇరాన్లో అణ్వాయుధాలు తయారుచేస్తున్నారని కేవలం ఊహామాత్రంగా తెలిస్తినే దాడులు చేసిన అమెరికా, మా ఆటంబాబులు ప్రత్యేకంగా భారత్ కోసమే తయారుచేసామని మీడియాముఖంగా ప్రకటించిన ఆ దేశ రక్షణమంత్రి మాటలను ఉటంకిస్తూ, భారత్ పాక్‌పై దాడిచేసినా ఏమనే పరిస్థితి లేదు.
ప్రస్తుతం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉన్నా, ఒకసారి ఉగ్రవాద కేంద్రాలు మళ్లీ జీవం పోసుకుంటే కశ్మీర్ మరోసారి అగ్నిగుండంగా మారడం ఖాయం.