పార్లమెంటు చొరబాటును తేలిగ్గా తీసుకోకూడదు.. తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ
నూతన పార్లమెంటు భవనం (Parliament) లోని లోక్‌సభలో ఈ నెల 13న చోటుచేసుకున్న చొరబాటు ఘటనపై ప్రధాని మోదీ (Modi) తొలిసారి స్పందించారు

నూతన పార్లమెంటు భవనం (Parliament) లోని లోక్‌సభలో ఈ నెల 13న చోటుచేసుకున్న చొరబాటు ఘటనపై ప్రధాని మోదీ (Modi) తొలిసారి స్పందించారు. ఘటన తీవ్రతను తక్కువ చేసి చూడటం ఎంత మాత్రం మంచిది కాదని ఆయన అన్నారు. దీని వెనుక ఉన్న శక్తులను, వారి ఉద్దేశాలను దర్యాప్తు ద్వారా బయటపెడతామని ఆయన అన్నారు. హిందీ దినపత్రిక దైనిక్ జాగరణ్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. చొరబాటు ఘటనపై స్పీకర్ ఓంబిర్లా, వివిధ దర్యాప్తు సంస్థలు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నాయి.
దీనిని తేలికగా తీసుకోవడానికి వీలు లేదు. లోతైన దర్యాప్తు చేసి ఈ పని వెనుక ఉన్న ఉద్దేశాలను బయటకు తీసుకురావాలి అని ఆయన అన్నారు. 2001లో పార్లమెంటుపై దాడి ఘటనను లోక్‌సభ గుర్తుచేసుకుంటున్న వేళ.. గ్యాలరీలోంచి ఇద్దరు వ్యక్తులు సభలోకి దూకి హడావుడి చేశారు. రంగు రంగు క్యానిన్లను పేల్చి అలజడి సృష్టించారు. వీరిని పలువురు ఎంపీలు అడ్డుకుని దేహశుద్ధి చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగమే ఇలాంటి ఘటనలకు కారణమని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించి దిల్లీ పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేయగా కోర్టు రిమాండు విధించింది.
కాల్చేసిన ఫోన్లు స్వాధీనం…
పార్లమెంటులో చొరబడిన నిందుతుల సెల్‌ఫోన్ల అవశేషాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సభలో తన అనుచరులు నిరసనకు దిగిన వెంటనే ప్రధాన నిందితుడు లలిత్ ఝా రాజస్థాన్‌కు పరారయ్యాడు. అక్కడే వారి అయిదు ఫోన్లను కాల్చేయగా.. .. ఆ శిథిలాలను ఆదివారం గుర్తించారు. కుట్రకు ప్రణాళిక వేసి.. మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించిన ఝా ఫోన్ ఇంకా దొరకాల్సి ఉందని ఒక అధికారి పేర్కొన్నారు