PM Modi | తెలుగు రాష్ట్రాల్లో మారనున్న రైల్వేస్టేషన్ల రూపురేఖలు..
దేశవ్యాప్తంగా అమృత్ భారత్ రైల్వేస్టేషన్లకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు

అమృత్ భారత్ స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్న మోదీ..
దేశవ్యాప్తంగా అమృత్ భారత్ రైల్వేస్టేషన్లకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.41వేలకోట్ల వ్యయంతో రైల్వే స్టేషన్లను ఆధునికీకరించనున్నారు. ప్రధాని ఆయా ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 553 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలోని రైల్వేస్టేషన్లను సైతం అభివృద్ధి చేయనున్నారు. తొలి దశలో ఆంధ్రప్రదేశ్‌లో 34 స్టేషన్లు, తెలంగాణలో 15 రైల్వేస్టేషన్లను ఆధునికీకరించనున్నారు. రూ.19వేలకోట్లతో స్టేషన్లలో ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలు కల్పించనున్నారు. పథకంలో రైల్వేస్టేషన్ల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ప్లాజాలు, ల్యాండ్‌స్కేపింగ్, ఇంటర్ మోడల్ కనెక్టివిటీ, పిల్లల ఆట స్థలం, కియోస్క్‌లు, ఫుడ్ కోర్ట్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఆయా స్టేషన్లను స్థానిక సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.843.54 కోట్ల వ్యయంతో రైల్వేస్టేషన్లను ఆధునికీకరించనున్నారు. ప్రధాని దేశవ్యాప్తంగా మొత్తం 553 రైల్వే స్టేషన్లకు ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనుండగా.. మరో 1500 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లకు సైతం భూమి పూజ చేయనున్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లు ఆధునికీకరించడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించనున్నారు. తొలిదశలో 270 కోట్ల ఖర్చుతో ఏపీలోని అనకాపల్లి, భీమవరం, ఏలూరు, కాకినాడ, తాడేపల్లి గూడెం, నర్సాపూర్, నిడదవోలు, ఒంగోలు, సింగరాయకొండ, తెనాలి, తుని రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయనున్నారు. రెండోదశలో బాపట్ల, చీరాల, ఆదోని, అనంతపురం, అనపర్తి, కంభం, ధర్మవరం, చిత్తూరు, గుడివాడ, గిద్దలూరు, గుత్తి, ఎమ్మిగనూరు, గుంటూరు, గుణదల, మచిలీపట్నం, మాచర్ల, కడప, మదనపల్లె స్టేషన్లతో పాటు రాజమండ్రి, తాడిపత్రి, శ్రీకాళహస్తి, సత్తెనపల్లి, సామర్లకోట, నంద్యాల, మంగళగిరి, మార్కాపురం, మంత్రాలయం, నడికుడి, నరసరావుపేట, పాకాల, వినుకొండ, రాజంపేట, రాయనపాడు స్టేషన్లు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఇక తెలంగాణలో రూ.230కోట్లకుపైగా నిధులతో 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ.169 కోట్లకుపైగా నిధులతో 17 రైళ్ల ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లను నిర్మించనున్నారు. రూ.221.18 కోట్లతో పూర్తిచేసిన మరో 32 ఫ్లై ఓవర్, అండర్‌పాస్‌లను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. రాష్ట్రంలో 40 స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన రైల్వేశాఖ.. ఇందుకు రూ.2,245 కోట్ల నిధులను కేటాయించింది. గతేడాది ఆగస్టులో రూ.894కోట్ల వ్యయంతో రూపొందించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 15 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను సైతం అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయి.