గిరిజనుల కోసం మోడీ కొత్త పథకం
దేశంలోని గిరిజనుల కోసం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం పీఎం జన్‌మన్ పథకం(ఆదివాసుల అభివృద్ధి పథకం) పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు

- నాగర్ కర్నూల్ చెంచులతో ప్రధాని వర్చువల్ భేటీ
విధాత : దేశంలోని గిరిజనుల కోసం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం పీఎం జన్‌మన్ పథకం(ఆదివాసుల అభివృద్ధి పథకం) పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో 100జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించనుండగా, తెలంగాణలో అదిలాబాద్, అసిఫాబాద్, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాలు ఈ పథకం పరిధిలో ఉన్నాయి. ఈ పథకం అమలులో భాగంగా 18రాష్ట్రాల్లో 75ఆదివాసి తెగలను గుర్తించి 24,104కోట్లు కేటాయించగా, లక్ష ఇండ్లను నిర్మించనున్నారు. పథకం ప్రారంభోత్సవం సందర్భంగా నేడు ప్రధాని మోడీ నాగర్‌కర్నూలు జిల్లా పరిధిలోని చెంచులతో వర్చువల్‌గా సమావేశమై మాట్లాడనున్నారు. ఆదివాసీ గురుకుల విద్యాలయం(పీటీజీ)లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు అందుకు ఏర్పాట్లు చేశారు.
డిజిటల్ తెర ఏర్పాటు చేశారు. సమావేశానికి జిల్లా పరిధిలోని అన్ని పెంటల నుంచి చెంచులు, చెంచు ప్రజాప్రతినిధులు మొత్తం 800 మందిని ఆహ్వానించారు. చెంచుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం జన్‌మన్ పథకం అమలుపై సమావేశంలో మోడీ వివరించనున్నారు. పథకంలో భాగంగా పాఠశాలల నిర్మాణం, గృహాల నిర్మాణం, స్వయం ఉపాధి కల్పన, సౌర విద్యుత్ ఏర్పాట్లు తదితర అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గిరిజనులతో మాట్లాడుతారని జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ అధికారి కమలాకర్ రెడ్డి, ఐటీడీఏ ఏవో జాఫర్ హుసేన్‌లు తెలిపారు.