రాష్ట్రపతిని కలిసిన .. ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ప్రధాని మోదీ 17వ లోక్‌సభ రద్ధు చేస్తూ కేంద్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని అందించారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాల ప్రక్రియ పూర్తయ్యినందునా 18వ లోక్‌సభ కొలువు తీరేందుకు వీలుగా 17వ లోక్‌సభను రద్ధు చేయాలని కోరారు.

రాష్ట్రపతిని కలిసిన ..  ప్రధాని మోదీ

17వ లోక్‌సభ రద్ధు చేయాలని వినతి
ప్రధాని పదవికి మోదీ రాజీనామా
ఆమోదించిన రాష్ట్రపతి
ఎన్డీఏ పక్షాలతో మోదీ భేటీ
మద్దతు లేఖలు అందించిన భాగస్వామ్య పార్టీలు

జూన్ 7న ఎన్డీఏ, బీజేపీ పార్లమెంటరీ పార్టీల పక్షాల సమావేశం
8వ తేదీన ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం

విధాత : ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ప్రధాని మోదీ 17వ లోక్‌సభ రద్ధు చేస్తూ కేంద్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని అందించారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాల ప్రక్రియ పూర్తయ్యినందునా 18వ లోక్‌సభ కొలువు తీరేందుకు వీలుగా 17వ లోక్‌సభను రద్ధు చేయాలని కోరారు. అలాగే ప్రధాని పదవికి తన రాజీనామాను సమర్పించారు. రాష్ట్రపతి మోదీ రాజీనామాను ఆమోదించి అపద్దర్మ ప్రధానిగా కొనసాగాలని కోరారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించిన నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీన ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ప్రమాణస్వీకార మహోత్సవం ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు బుధవారం నాలుగు గంటలకు మోదీ నివాసంలో గంటన్నర పాటు ఎన్డీఏ మిత్ర పక్షాలు సమావేశమయ్యాయి.

ప్రభుత్వ ఏర్పాటుకు మద్ధతుగా ఎన్డీఏ పక్షాల లేఖలు

మోదీ నివాసంలో జరిగినఎన్డీఏ భేటీలో అమిత్‌ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నితీశ్‌ కుమార్, ఏక్‌నాథ్ షిండే, చిరాగ్ పాశ్వాన్‌, ప్రఫుల్ పటేల్‌, అనుప్రియ సహా 14భాగస్వామ్య పక్షాల నేతలు హాజరై ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ భాగస్వామ్య పార్టీలు మోదీకి లేఖలు అందించాయి. జూన్ 7న ఎన్డీఏ, బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ పక్ష నేతను ఎన్నుకుంటారు. కేంద్రంలో బీజేపీకి ఈ సారి ఎన్నికల్లో మెజార్టీ మార్కు 272సీట్లు సొంతంగా రాకపోవడంతో ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిత్రపక్షాల్లో ఎక్కువ ఎంపీలు కలిగిన టీడీపీ, జేడీయూలు ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాయి.

నంబర్స్‌ గేమ్ కొనసాగుతుంది : మోదీ

రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని, అయితే నంబర్స్ గేమ్ మాత్రం కొనసాగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ ప్రస్తుత ప్రభుత్వ చివరి మంత్రివర్గం సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో ఎన్నో మంచి పనులు చేశామని, దాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తామన్నారు. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్‌లోని మంత్రుల పనితనాన్ని మొచ్చుకున్నారు. పదేళ్లుగా ఎంతో కష్టపడి పనిచేసినందుకు, తమ విలువైన సేవలను అందించి ప్రభుత్వానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.