Rajnath Singh: అప్పులు తెచ్చి టెర్రరిస్టులను మేపుతారా?.. కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
పాకిస్థాన్ ఐఎంఎఫ్ నిధులను టెర్రరిస్టులను మేపేందుకు వాడుతున్నదని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. భారత్ ఆపరేషన్ సిందూర్ లో భాగంగా టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేస్తే.. వాటిని పాక్ మళ్లీ పునరుద్ధరిస్తున్నదంటూ ఫైర్ అయ్యారు.

Rajnath Singh: కేంద్రరక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ అప్పులు తెచ్చి మరీ ఉగ్రవాదులను మేపుతుందంటూ మండిపడ్డారు. పాకిస్థాన్ ఎన్నో ఏండ్లుగా ఉగ్రవాదులను పెంచిపోషిస్తుంటే .. భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లోనే వారిని మట్టుపెట్టిందని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గుజరాత్ లోని భుజ్ వైమానిక దళంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
దాయాది దేశ చర్యలను భారత్ నిశితంగా గమనిస్తున్నదని పేర్కొన్నారు. తేడా వస్తే ఆ దేశంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాకిస్థాన్ అప్పులు చేసి మరీ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నదని ఆరోపించారు. భారత్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తే వాటిని పునః నిర్మించుకోవడానికి పాకిస్థాన్ జైషే మహ్మద్ చీఫ్ మజూర్ అజార్ కు రూ. 14 కోట్లు మంజూరు చేసిందని ఆరోపించారు. ఐఎంఎఫ్ నిధులను పాకిస్థాన్ ఉగ్రవాదుల కోసం వెచ్చిస్తున్నదని పేర్కొన్నారు. పాకిస్థాన్ కు అప్పులు ఇచ్చే విషయంపై ఐఎంఎఫ్ పునరాలోచించుకోవాలని సూచించారు.