రాముడిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటిస్తారేమో!
అయోధ్యలో రామమందిరం అంశాన్ని బీజేపీ రాజకీయ అవసరాలకు వాడుకోవడాన్ని శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్‌రౌత్ తీవ్రంగా తప్పుపట్టారు

- దేవుడి పేరుతో బీజేపీ రాజకీయం
- రామమందిరం ప్రారంభోత్సవంపై శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్
- ఆలయ ప్రారంభాన్ని బీజేపీ కార్యక్రమంగా మార్చేశారని విమర్శ
ముంబై: అయోధ్యలో రామమందిరం అంశాన్ని బీజేపీ రాజకీయ అవసరాలకు వాడుకోవడాన్ని శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్‌రౌత్ తీవ్రంగా తప్పుపట్టారు. రాబోయే ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థిగా రాముడిని ప్రకటిస్తారేమోనని ఎద్దేవా చేశారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానంపై ఒక మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు రౌత్ సమాధానమిస్తూ ‘ఇప్పుడిక మిగిలిందల్లా రాబోయే ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థిగా రాముడిని ప్రకటించడమే’ అని అన్నారు. రాముడి పేరుతో పెద్ద ఎత్తున రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం కూడా అయోధ్యలో 22న జరుగబోయే ఆలయ ప్రారంభోత్సవం బీజేపీ కార్యక్రమమే తప్ప దేశ కార్యక్రమం కాదని రౌత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
రాముడిని బీజేపీ కిడ్నాప్ చేసిందని ఆయన ఆరోపించారు. ఆలయ ప్రారంభోత్సవానికి శివసేన (ఉద్ధవ్) నేత ఉద్ధవ్ ఠాక్రె హాజరవుతారా? అన్న ప్రశ్నకు ‘ఠాక్రె తప్పకుండా వెళతారు. కానీ.. ‘బీజేపీ కార్యక్రమం’ ముగిసిన తర్వాతే. బీజేపీ కార్యక్రమానికి ఎవరైనా ఎందుకు వెళ్లాలి? ఇది జాతీయ కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమం కోసం బీజేపీ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నది. ప్రచారం చేస్తున్నది. కానీ.. బీజేపీ చర్యల్లో పవిత్రత ఎక్కడ ఉన్నది?’ అని ఆయన ప్రశ్నించారు. ‘బీజేపీ ఏదైనా కార్యక్రమం చేయాలని అనుకున్నప్పుడు తన పార్టీ యంత్రాంగం మొత్తాన్నీ మోహరిస్తుంది.
దేశవ్యాప్తంగా బీజేపీ అదే తరహాలో పనిచేస్తుంది’ అని చెప్పారు. ‘నిరుద్యోగం, ధరల పెరుగదల, మణిపూర్ వంటి సమస్యలను దేశం మర్చిపోవాలని బీజేపీ కోరుకుంటున్నది’ అని రాజ్యసభ సభ్యుడు కూడా అయిన రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయం కోసం శివసేన కార్యకర్తలు నెత్తురు చిందించారని రౌత్ తెలిపారు. కరసేవలో వేల మంది సైనికులు పాల్గొన్నారని గుర్తు చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రె కార్యకర్తలతో కలిసి అయోధ్యకు వెళ్లారని తెలిపారు. రామజన్మభూమి ఉద్యమంతో తమ పార్టీకి బలమైన సంబంధం ఉన్నదని ఆయన నొక్కి చెప్పారు.