Supreme Court Marital Disputes | విడాకుల కేసులలో సాక్ష్యాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
గతంలో ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానంలేదు. కానీ.. ఇప్పుడు ప్రపంచం మారిపోతున్నది. కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విలక్షణమైనదని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Supreme Court Marital Disputes | వైవాహిక ఆంతరంగిక గోప్యత, నిష్పాక్షిక విచారణ హక్కు మధ్య సున్నితమైన సమతుల్యాన్ని మీటుతూ దేశ సర్వోన్నత న్యాయ స్థానం సంచలన రూలింగ్ ఇచ్చింది. విడాకులు సహా అన్ని వైవాహిక వివాదాల కేసులలో సాక్ష్యాలుగా భర్త లేదా భార్య రహస్యంగా రికార్డ్ చేసిన వాటిపై ఆధారపడవచ్చని స్పష్టం చేసింది. ఇదే కేసులో గతంలో పంజాబ్ హర్యానా హైకోర్టు 2021లో ఇచ్చిన తీర్పును జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. తన భార్య నుంచి విడాకులు కోరిన ఒక భర్త.. రహస్యంగా ఫోన్ కాల్స్‌ను రహస్యంగా రికార్డు చేసిన సీడీ లేదా మెమొరీ కార్డ్‌ను అందుకు సాక్ష్యంగా సమర్పించడాన్ని పంజాబ్ హర్యానా హైకోర్టు తిరస్కరించింది. దీనిపై సదరు భర్త సుప్రీంకోర్టుకు వెళ్లగా ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువడింది.
ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే. 2017లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న భర్త.. తన భార్యపై చేస్తున్న ఆరోపణలను నిరూపించేందుకు టెలిఫోన్ సంభాషణల రికార్డింగ్‌తో కూడిన సీడీని కోర్టుకు సమర్పించాడు. అంతకు ముందు భటిండా ఫ్యామిలీ కోర్టు సదరు భర్త సీడీని సమర్పించేందుకు అంగీకరించింది. అయితే దాన్ని ప్రామాణికతను ధృవీకరించుకోవాల్సి ఉన్నదని పేర్కొన్నది. కానీ.. హైకోర్టు మాత్రం ఈ చర్య భార్య ఆంతరంగిక గోప్యతను భగ్నం చేయడం కిందికి వస్తుందంటూ సదరు సాక్ష్యాన్ని తీసుకునేందుకు నిరాకరించింది. సర్వోన్నత న్యాయస్థానం మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది. భారతీయ సాక్ష్యాల చట్టంలోని సెక్షన్ 122 ప్రకారం వేరొకరి సమ్మతి లేకుండా భార్యాభర్తల మధ్య సంభాషణలు బయటపెట్టడాన్ని సాధారణంగా నిరోధిస్తున్నది. అయితే.. ‘ఈ కేసులో ఆంగరంగిక గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లినట్టుగా మేం అనుకోవడం లేదు. వాస్తవానికి సాక్ష్యాల చట్టంలోని సెక్షన్ 122 అటువంటి హక్కును గుర్తించడం లేదు. అదే సమయంలో ఇది జీవిత భాగస్వాముల మధ్య గోప్యత హక్కుకు మినహాయింపును ఇస్తున్నది. రాజ్యాంగంలోని 21వ అధికరణంలో పేర్కొన్న గోప్యత హక్కు అంశాన్ని ఇది స్పృశించడం లేదు. నిష్పాక్షిక విచారణ కోరుకునే హక్కు దృష్ట్యా జీవిత భాగస్వామిపై కేసును నిరూపించుకునేందుకు హక్కును ఇది గుర్తిస్తుంది’ అని పేర్కొంది.
రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం న్యాయమైన విచారణకు ప్రాథమిక హక్కు ఉన్నదని, దానితోపాటే ఈ హక్కును కూడా గుర్తించాలని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. గోప్యత అనేది ప్రాథమిక హక్కు అని ప్రకటించిన 2017 నాటి కేఎస్ పుట్టస్వామి తీర్పును కూడా న్యాయమూర్తులు ప్రస్తావించారు. అయితే.. జీవిత భాగస్వాముల మధ్య న్యాయ పోరాటాల్లో చెల్లుబాటయ్యే సాక్ష్యాలను అవి నిరోధించలేవని పేర్కొన్నారు. ఒకరి సంభాషణలు రికార్డు చేసే స్థాయికి పరిస్థితి వచ్చిందంటే వారి వైవాహిక జీవితం పునరుద్ధరించలేనంతగా విచ్ఛిన్నమైందని పేర్కొన్నారు. నిఘా పెట్టడం అనేది విచ్ఛిన్నమైన వివాహ లక్షణమని వ్యాఖ్యానించారు. చట్ట ప్రకారం పరీక్షల్లో రుజువయ్యే రికార్డింగ్స్‌ను ఉపయోగించవచ్చని 2020 నాటి భటిండా ఫ్యామిలీ కోర్టు తీర్పును తక్షణం పునరుద్ధరిస్తున్నట్టు తెలిపింది. గతంలో ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానంలేదు. కానీ.. ఇప్పుడు ప్రపంచం మారిపోతున్నది. కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విలక్షణమైనదని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.