బిహార్‌లో పడవ బోల్తా.. ముగ్గురి మృతి.. 18 మంది గల్లంతు

బిహార్ (Bihar) లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 25 మందితో వెళుతున్న పడవ బోల్తా పడటంతో కనీసం ముగ్గురు మరణించారు. మరో 18 మంది గల్లంతయ్యారు. సరణ్ జిల్లాలోని సరయు నదిపై బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో మరో తొమ్మిది మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతి చెందిన వారిని గుర్తించాల్సి ఉందని కలెక్టర్ అమన్ సమీర్ తెలిపారు. ప్రమాదానికి కారణం కనుగొనాల్సి ఉన్నప్పటికీ.. ప్రయాణికులందరూ పడవపై ఒకే వైపునకు వచ్చేయడంతోనే దుర్ఘటన జరిగిందని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో బిహార్‌లో ఇది రెండో పడవ ఘటన కావడం గమనార్హం. ఇదే ఏడాది సెప్టెంబరు 14న బాగమతీ నదిపై పడవ బోల్తా కొట్టడంతో కనీసం 15 మంది చిన్నారులు గల్లంతయ్యారు.