గురుగ్రామ్‌లో ఆక‌తాయిల అరాచ‌కం

గురుగ్రామ్‌లో ఆక‌తాయిల అరాచ‌కం
  • ర‌న్నింగ్ కారుపై ప‌టాకులు కాల్చి ఆనందం
  • సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన వీడియో
  • ఆక‌తాయిల తీరుపై దుమ్మెత్తిపోతున్న నెటిజ‌న్లు



విధాత‌: ఇప్ప‌టికే దేశ రాజ‌ధాని ఢిల్లీలో వాయు కాలుష్యం దారుణంగా పెరిగింది. నాలుగేండ్లుగా అక్క‌డ ప‌టాకులు, కాక‌ర్స్ కాల్చ‌డంపై రాష్ట్ర ప్ర‌భుత్వం నిషేధం విధిస్తూ వ‌స్తున్న‌ది. కానీ, కొంద‌రు ఆక‌తాయిలు ప్ర‌భుత్వం నిబంధ‌న‌లను ప‌ట్టించుకోవ‌డం లేదు. అక్ర‌మంగా ప‌టాకులు కాల్చుతూనే ఉన్నారు. కాలుష్యం పెంచుతూ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు.


తాజాగా ఢిల్లీ- హ‌ర్యానా స‌రిహ‌ద్దు రాష్ట్రాల జిల్లా గురుగ్రామ్‌లో ర‌న్నింగ్ కారుపై కొంద‌రు ఆక‌తాయిలు ప‌టాకులు కాల్చారు. గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో నంబర్ ప్లేట్ లేని కారు స్పీడ్‌గా వెళ్తుండ‌గా, డోరుకు వేళాడుతూ ఓ వ్య‌క్తి కారుపై ప‌టాకులు పెట్టి కాల్చుతున్నాడు. ఈ ఘ‌ట‌న‌ను ఆ కారు వెనుకాల మ‌రో వాహ‌నంలో వ‌స్తున్న వ్య‌క్తి వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పెట్ట‌డంతో వైర‌ల్‌గా మారింది. ఆక‌తాయిల‌ తీరుపై నెటిజ‌న్లు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై గురుగ్రామ్ పోలీసులు సైతం ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. గురుగ్రామ్‌లో గ‌త ఏడాది కూడా ఇదే త‌ర‌హా ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది.