H-1B Fee Hike | ట్రంప్ ప్రభుత్వంపై కేసు వేసే ఆలోచనలో అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్

ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా ఫీజును 100,000 డాలర్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ,  US చాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. ఈ పెంపుదల ప్రభావం భారతీయ టెకీలపై మాత్రమే కాక, అమెరికా టెక్ రంగంపై కూడా తీవ్రంగా ఉంటుందని చాంబర్​ భావిస్తోంది.

H-1B Fee Hike | ట్రంప్ ప్రభుత్వంపై కేసు వేసే ఆలోచనలో అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ Washington, DC

H-1B Fee Hike | అమెరికాలో H-1B వీసా హోల్డర్లకు షాక్ ఇచ్చేలా, ట్రంప్ ప్రభుత్వం ఇటీవలే ప్రతి వీసాకు వార్షికంగా 1,00,000 డాలర్ల ఫీజు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా సాంకేతిక, ఆరోగ్య, ఆర్థిక రంగాల్లోని లక్షలాది మంది విదేశీ నిపుణులు H-1B వీసాలపై పనిచేస్తుంటారు. వీరి నైపుణ్యం అమెరికన్​ కంపెనీలకు అవసరం కాబట్టి, అవే  H-1B వీసాలకు సిఫారసు చేస్తాయి. ఈ విధంగా వీసాలు పొందినవారిలో భారతీయులే అధికం.

ఈ భారీ ఫీజు పెంపుదల కంపెనీలకు మాత్రమే కాకుండా, ఉద్యోగులకు  కూడా కష్టం కలిగించనుంది. ప్రత్యేకించి స్టార్టప్‌లు, మిడ్‌సైజ్ కంపెనీలు ఈ అదనపు ఖర్చును భరించడం కష్టమవుతుందని ఇండస్ట్రీ పెద్దలు చెబుతున్నారు.

US Chamber of Commerce May Sue Trump Over $100,000 H-1B Visa Fee Hike – Indian Techies on Edge

US చాంబర్ ఆఫ్ కామర్స్ – న్యాయ పోరాటానికి సిద్ధమా?

అమెరికాలోని అతిపెద్ద బిజినెస్ లాబీ, US చాంబర్ ఆఫ్ కామర్స్, ఈ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉంది. బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ ప్రకారం, చాంబర్ తన సభ్య సంస్థలతో ఫోన్ కాల్స్, జూమ్ మీటింగ్‌ల ద్వారా చర్చలు జరిపింది. ఇందులో Amazon, Alphabet (Google), Meta వంటి దిగ్గజాలు కూడా సభ్యులుగా ఉన్నాయన్న విషయం ప్రాధాన్యత సంతరించుకుంది.

చాంబర్ ప్రతినిధి మ్యాట్ లెటోర్నో మాట్లాడుతూ –
“అధ్యక్షుడి అధికార ప్రకటన న్యాయపరీక్షకు నిలబడుతుందా లేదా అన్నది మేము పరిశీలిస్తున్నాం. మా సభ్య సంస్థల నుంచి విపరీతమైన భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత వీసా హోల్డర్లపై కూడా ఈ నిర్ణయం వర్తిస్తుందేమో అన్న భయం ఉంది. ఈ విషయమై మేము ప్రభుత్వంతో నేరుగా మాట్లాడుతున్నాం అన్నారు.

గతంలోనూ ట్రంప్ పాలసీలపై కేసులు

ఇదే జరిగితే, ట్రంప్ ప్రభుత్వంపై చాంబర్ రెండోసారి కోర్టు వెళ్ళినట్లవుతుంది.

  • 2020లో ట్రంప్ ప్రభుత్వం కొత్త నాన్-ఇమిగ్రెంట్ వీసాలను సస్పెండ్ చేసినప్పుడు, చాంబర్, వ్యాపారప్రయోజనాలకు విరుద్ధం – బ్యాడ్ ఫర్ బిజినెస్” అంటూ కేసు వేసింది.
  • ఆ కేసులో ఫెడరల్ కోర్టు చాంబర్ వాదనకు అనుకూలంగా తీర్పు ఇచ్చి, ట్రంప్ పాలసీని కొట్టివేసింది.

ఈసారి కూడా చాంబర్ న్యాయ పోరాటానికి వెళ్తే, వీసా ఫీజు పెంపును కొట్టివేసే అవకాశముందన్న అంచనాలు ఉన్నాయి.

ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ ఫీజు పెంపుదలను సమర్థిస్తూ –
H-1B వీసా ప్రోగ్రామ్ అసలు ఉద్దేశం అత్యంత నైపుణ్యం కలిగినవారిని తాత్కాలికంగా తీసుకురావడం. కానీ దీన్ని అమెరికన్ ఉద్యోగులకు దక్కాల్సిన స్థానాలను ర్తీ చేయడానికి వాడుతున్నారు. కాబట్టి, ఈ దుర్వినియోగాన్ని తగ్గించడానికి కఠినమైన అడ్డంకులు అవసరం అన్నారు. అదే సమయంలో “టెక్ ఇండస్ట్రీ ఈ మార్పుతో సంతోషపడుతుందని నేను అనుకుంటున్నాను” అని కూడా వ్యాఖ్యానించారు. కానీ వాస్తవానికి టెక్ రంగంలో భారీ ప్రతికూలత కనిపిస్తోంది. అత్యధిక శాతం H-1B వీసాలు సిఫారసు చేసే ఆరోగ్య, అర్థికరంగాలు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

రిశ్రమల ప్రతిస్పందన  – ఆందోళనలో ఇండియన్ టెకీలు

H-1B వీసాలు ప్రధానంగా భారతీయ ఐటీ నిపుణులు  ఆధారపడే ఉద్యోగ వనరులు.

  • ప్రస్తుతం సుమారు 75% H-1B హోల్డర్లు భారతీయులే.
  • అమెరికాలో టెక్ రంగంలో పని చేసే నిపుణుల్లో అధికశాతం భారతీయులే ఉండటం వల్ల ఈ నిర్ణయం నేరుగా ప్రభావం చూపనుంది.

విశ్లేషకుల ప్రకారం –

  • పెద్ద కంపెనీలు ఈ ఖర్చును భరించగలిగినా, చిన్న సంస్థలు కొత్త H-1B రికమెండేషన్లను తగ్గించవచ్చు.
  • దాంతో అమెరికాలో ఉద్యోగ అవకాశాలు క్షీణించడం, భారత నిపుణులకు కొత్త వీసాలు తగ్గిపోవడం వంటి పరిణామాలు ఉండవచ్చని అంటున్నారు.

H-1B వీసా ఫీజు పెంపు నిర్ణయం ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరోసారి అమెరికా బిజినెస్ లాబీని కోర్టు దిశగా నడిపిస్తోంది. 2020లోలాగే ఈసారి కూడా చాంబర్ న్యాయ పోరాటానికి వెళ్తే, వీసా విధానంలో కీలక మార్పులు రావచ్చు.

భారతీయ ఐటీ వర్కర్లకు, అమెరికా కంపెనీలకు కూడా ఇది క్లిష్ట పరిస్థితి. అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న నైపుణ్య వర్గం భవిష్యత్తు ఇప్పుడు కోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఎంతసేపు ఇది భారతీయ నిపుణులకు ప్రమాదకరమని అంటున్నా, నిజానికి అమెరికాకు కూడా ప్రమాదకరమేనని చాంబర్​ భావిస్తోంది. అందుకే న్యాయపోరాటం చేసేందుకు పావులు కదుపుతోంది.