అంబానికి బెదిరింపు మెయిల్‌.. రూ.20 కోట్లు ఇవ్వ‌క‌పోతే చంపేస్తాం

అంబానికి బెదిరింపు మెయిల్‌.. రూ.20 కోట్లు ఇవ్వ‌క‌పోతే చంపేస్తాం
  • మా ద‌గ్గ‌ర బెస్ట్ షూట‌ర్లు ఉన్నారు
  • కేసు న‌మోదు.. నిందితుడి గుర్తింపు



విధాత‌: దేశంలోనే అత్యంత సంప‌న్నుడు, రిల‌య‌న్స్‌ ఇండస్ట్రీస్ అధినేత‌ ముఖేష్ అంబానీకి చంపేస్తామ‌నే బెదిరింపు మెయిల్ వ‌చ్చింది. పారిశ్రామికవేత్త త‌మ‌కు రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామ‌ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఇటీవ‌ల మెయిల్ పంపారు. “మీరు మాకు 20 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే, మేము మిమ్మల్ని చంపుతాము. భారతదేశంలో అత్యుత్తమ షూటర్లు మా వద్ద ఉన్నారు” అని ఈ మెయిల్ పేర్కొన్నారు.


అంబానీ నివాసం యాంటిలియాలోని భద్రతా అధికారులు హత్య బెదిరింపు విష‌యాన్నిస్థానిక పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. ముంబైలోని గామ్‌దేవి పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై ఐపీసీ 387, 506 (2) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 27న షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్టు పోలీసులు తెలిపారు.


అంబానీ, ఆయ‌న కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బెదిరిస్తూ కాల్స్ చేసినందుకు బీహార్‌కు చెందిన ఒక వ్యక్తిని ముంబై పోలీసులు గత ఏడాది అరెస్టు చేశారు. దక్షిణ ముంబైలోని అంబానీ కుటుంబ నివాసం ‘యాంటిలియా’తో పాటు హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌ను పేల్చివేస్తానని గ‌తంలో కాల్ చేసిన వ్యక్తి బెదిరించాడు.