Adipurush Review | ‘రామాయణం’ కాదు.. పిల్లలు కోసం చేసిన వీడియో గేమ్
Adipurush Review | మూవీ పేరు: ‘ఆదిపురుష్’ విడుదల తేదీ: 16 జూన్, 2023 నటీనటులు: ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ తదితరులు కెమెరా: కార్తీక్ పళణి సంగీతం: అజయ్-అతుల్ నేపథ్య సంగీతం: సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా ఎడిటింగ్: అపూర్వ మోత్వాలే సాహాయ్, అనిష్ మహత్రే నిర్మాతలు: భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్, వంశీ, ప్రమోద్ […]

Adipurush Review |
మూవీ పేరు: ‘ఆదిపురుష్’
విడుదల తేదీ: 16 జూన్, 2023
నటీనటులు: ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ తదితరులు
కెమెరా: కార్తీక్ పళణి
సంగీతం: అజయ్-అతుల్
నేపథ్య సంగీతం: సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా
ఎడిటింగ్: అపూర్వ మోత్వాలే సాహాయ్, అనిష్ మహత్రే
నిర్మాతలు: భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్, వంశీ, ప్రమోద్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఓం రౌత్
‘ఆదిపురుష్’ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు.. ఒక్కసారి ఈ సినిమా ప్రారంభ రోజులకి వెళ్లి వద్దాం. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పేరు గడించిన ప్రభాస్‌కు బాలీవుడ్‌లో సైతం భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ ఫాలోయింగ్‌ని క్యాష్ చేసుకోవాలనుకున్నారో.. లేదంటే వెనుక మరేదైనా కారణం ఉందో తెలియదు కానీ.. రెండు సినిమాల అనుభవం ఉన్న బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్‌ని సంప్రదించడం, భారీ పాన్ ఇండియా అని చెబుతూ ‘ఆదిపురుష్’ని అనౌన్స్ చేయడం జరిగింది. అంతే ఒక్కసారిగా ఈ కాంబినేషన్‌పై వార్తలు వైరల్ అయ్యాయి. పాన్ వరల్డ్ సినిమా అనే రేంజ్‌లో షూటింగ్ ప్రారంభమైంది.
అయితే ప్రారంభమైన రెండు మూడు రోజులకే రూ. కోటి రూపాలయతో వేసిన సెట్ అగ్నికి ఆహుతి అయినట్లుగా వార్తలు రావడంతో.. సినిమాపై మరింతగా ఆసక్తి క్రియేట్ అయింది. ఆ రోజు నుంచి టీజర్ విడుదలయ్యే వరకు.. ‘ఆదిపురుష్’ సినిమాతో ప్రభాస్ ఏదో అద్భుతం చేయబోతున్నాడనేలానే టాక్ నడిచింది. ఎప్పుడైతే టీజర్ విడుదలైందో.. సినిమాపై ఉన్న ఇంట్రస్ట్ మొత్తం పోయింది. ఇదొక యానిమేషన్ సినిమా అనేలా, నాసిరకపు విఎఫ్‌ఎక్స్‌తో వచ్చిన టీజర్‌ని ఫ్యాన్స్ కూడా తిరస్కరించారు. దీంతో ఓం రౌత్ మళ్లీ కూర్చుని.. మరో రూ. 200 కోట్లు ఎక్కించి.. దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
టీజర్‌తో పడిపోయిన క్రేజ్‌ని పెంచడానికి యూనిట్ ఎంతగానో ట్రై చేస్తూ వచ్చింది. అయోధ్యలో సినిమా ఈవెంట్స్ నిర్వహించడం మొదలుకుని రకరకాల ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. అయినా కూడా సినిమాపై మొదట ఉన్నంత క్రేజ్ రాలేదు. ఇక లాభం లేదనుకున్న టీమ్ చిత్ర ట్రైలర్‌తోనైనా జనాల్లోకి ఈ సినిమా తీసుకెళ్లాలని బాగా ట్రై చేసింది. ఆ ప్రయత్నం ఫలించింది. ట్రైలర్ ఆకట్టుకోవడంతో అంచనాల గ్రాఫ్ కాస్త లేచింది.
ఇక ఆ తర్వాత వదిలిన జై శ్రీరామ్ సాంగ్.. ఈ సినిమాని ఓ రేంజ్‌కి చేర్చేసింది. ఆ సాంగ్ హంటింగ్‌లా మారి.. అందరి నోళ్లలో నానడం మొదలైంది. ఆ సాంగ్ తర్వాత సినిమాపై క్రేజ్ విషయంలో కూడా తేడా వచ్చేసింది. ఆ క్రేజ్‌కి తగ్గట్లే.. తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ సక్సెస్ అయింది. సినిమాపై ప్రపంచవ్యాప్తంగా కన్నుపడేలా చేయడంలో ఆ ఈవెంట్ నూటికి నూరు శాతం సక్సెస్ అయింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వదిలిన ఫైనల్ ట్రైలర్ అంతగా అలరించకపోయినా.. ఆ మరుసటి రోజు తిరుమలలో కృతిసనన్, ఓం రౌత్‌ల హగ్గు, కిస్ సీన్ టాక్ ఆఫ్ ద సినిమాగా మారడంతో.. మరో కోణంలో ఈ సినిమా వార్తలలో హైలెట్ అవుతూ.. జనాలలోకి మరింతగా వెళ్లిపోయింది. ఇక ఇండస్ట్రీకి చెందిన కొందరు, హిందుత్వాన్ని ఇష్టపడే మరికొందరు బల్క్‌గా ఈ సినిమా టికెట్లను కొని.. అనాథల ఫౌండేషన్స్‌లోని వారికి, స్కూల్ పిల్లలకు ఉచితంగా చూపించడానికి ముందుకు రావడంతో కూడా ఈ సినిమాని వార్తలలో నిలుపుతూ వచ్చారు.
ముఖ్యంగా థియేటర్లలో హనుమంతుడి కోసం ఒక సీటు ఖాళీగా ఉంచుతామనే ప్రకటన కూడా బాగా కనెక్ట్ అయింది. మొత్తంగా అయితే.. టీజర్ విడుదల అయినప్పుడు విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం.. విడుదల నాటికి మాత్రం ఆకాశమే హద్దు అనేలా అంచనాలని సొంతం చేసుకుంది. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? రామాయణం గురించి అణువణువు తెలిసిన ప్రేక్షకులని.. ఆధునిక రామాయణం అని ఓం రౌత్ చేసిన ఈ ప్రయోగం ఏ మేరకు మెప్పించింది? అసలీ రామాయణంలో ఉన్న రమ్యత ఏమిటో.. రివ్యూలో తెలుసుకుందాం.
Adipurush | ఆదిపురుష్ సినిమాకు అనూహ్య అతిథి.. థియేటర్‌లో సినిమా చూసిన వానరం
కథ:
కథగా చెప్పాలంటే.. ముందే చెప్పుకున్నట్లుగా రామాయణం గురించి అందరికీ కాకపోయినా.. చాలా మందికి అందులోని అణువణువు తెలుసు. ఏడు కాండములు కలిగిన వాల్మీకి రామాయణంలోని అరణ్య, యుద్ధ కాండములను మాత్రమే దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమా కోసం తీసుకున్నాడు. అవే ఎందుకు అనేది విశ్లేషణలో చూద్దాం. ఆ రెండు కాండముల నుంచి ఆయన రాసుకున్న కథ గురించి చెప్పుకుంటే.. దశరథ మహారాజు (ప్రభాస్).. తన వృద్దాప్యం దృష్ట్యా రాజ్యపాలన నుంచి విముక్తి తీసుకుని.. తనకెంతో ఇష్టమైన కుమారుడు రాఘవ్(ప్రభాస్)ని అయోధ్యకు రాజుని చేయాలని అనుకుంటాడు.
అదే సమయంలో కైకేయి.. దశరథ మహారాజుని రెండు కోరికలు కోరుతుంది. రాఘవుడిని 14 ఏళ్ల పాటు వనవాసానికి పంపాలని, అలాగే తన కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం చేయాలని కోరుతుంది. దశరథ మహారాజు ఇచ్చిన మాట కోసం.. కుమారుడైన రాఘవుడు తన భార్య జానకి (కృతిసనన్) మరియు శేషు (సన్నీసింగ్)తో కలిసి వనవాసానికి బయలుదేరతాడు.
ఇలా మొదలైన ఈ కథ.. వనవాసంలో ఉన్న జానకిని రాఘవ్, శేషు లేని సమయంలో లంకేశ్ (సైఫ్ అలీఖాన్) మాయ చేసి అపహరించి.. లంకలోని అశోకవనంలో బంధిస్తాడు. బంధీగా ఉన్న జానకిని రాఘవుడు ఎలా చేరుకున్నాడు? లంకేశ్‌ని జయించి జానకిని ఎలా తీసుకొచ్చాడు? ఈ ప్రయాణంలో వానర సైన్యం ఆయనకి ఎలాంటి సహాయం చేసింది? అనేది ఆధునీకరించి.. ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా మలిచిన విజువల్ ట్రీటే ఈ ‘ఆదిపురుష్’. ఇది చాలా మందికి తెలిసిన కథే.. కానీ ఓం రౌత్ తనకి అనుగుణంగా మార్చుకున్న మార్పులేమిటి? అనేదే ఇక్కడ ప్రధాన అంశం.
నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:
‘ఆదిపురుష్’ చిత్రానికి మొదటి నుంచి అండ, దండ అంటూ ఎవరైనా ఉన్నారూ అంటే.. అది ప్రభాసే. బాహుబలిలో ప్రభాస్‌ని చూసిన వారు.. రాముడిగా ప్రభాస్ అనగానే.. ఆ హైటూ, పర్సనాలిటీ పర్ఫెక్ట్‌గా సూటవుతాడని, ఇనవంశోత్తమునిగా హుందాగా ఉంటాడని అనుకున్నారు. చాలా వరకు ప్రభాస్ కూడా బాగానే మ్యానేజ్ చేశాడు. ఎందుకంటే రాముడు మృదుస్వభావి. ఎలాంటి సందర్భమైనా ఆయన నవ్వుతూనే ఉండే స్వల్ప సంభాషి. ప్రభాస్ ఏమో వీరత్వానికి చిహ్నం అన్నట్లుగా ఉంటారు. రాఘవుడిగా ఉండేందుకు ప్రభాస్ చాలా ట్రై చేశాడు కానీ.. వానర సైన్యానికి దిశానిర్ధేశం చేసే క్రమంలో మాత్రం ఆయనలోని బాహుబలి మరోసారి బయటికి వచ్చాడనిపించింది.
తనవరకు ప్రభాస్ సాధ్యమైనంత ఈ సినిమాకు చేశాడు. జానకిగా చేసిన కృతి సనన్.. చాలా కృత్రిమంగా కనిపించింది. బహుశా.. సీతగా తెలుగువారు కొందరికే చోటు ఇచ్చి ఉండటం వల్ల.. ఆమె జానకిగా అంతగా మెప్పించి (ఆనక) ఉండకపోవచ్చు. ఇదే విషయం లంకేశ్ అదే మన రావణుడికి కూడా వర్తిస్తుంది. రావణుడు అనగానే అందరికీ ఎస్వీఆరో, ఎన్టీఆరో గుర్తుకు వస్తారు. కానీ ఇక్కడ లంకేశ్ అంటూ సైఫ్ అలీ ఖాన్‌ని, ఆయన నటనని జీర్ణించుకోలేరు. హనుమగా చేసిన దేవదత్తా తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. ఇంకా ఇతర పాత్రలలో చేసిన సన్నీ సింగ్, మండోదరిగా చేసిన సోనాల్ చౌహాన్ వంటి వారంతా ఓం రౌత్ చెప్పింది చేసుకుపోయారు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే..
ఈ సినిమాకి మొదటి నుంచి అనుకుంటున్నట్లుగా అజయ్ అతుల్ స్వరపరిచిన పాటలే ప్రధాన హైలెట్ అని చెప్పుకోవాలి. అయితే వారు స్వర పరిచిన పాటలు కనెక్ట్ అయ్యేలా ఉన్నా.. తెరపై జానకి, రాఘవ్‌ల బంధాన్ని చూపించడంలో దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడు. నేపథ్య సంగీతానికి మరో ఇద్దరు సంగీత దర్శకులు పనిచేశారు. వారు మాత్రం పూర్తి స్థాయిలో ఈ సినిమాకు న్యాయం చేశారు. ముఖ్యంగా బీజీఎమ్ హంట్ చేస్తుంది. ఎడిటింగ్ పరంగానూ ఇద్దరు పని చేశారు. ఎంతమంది పనిచేసినా.. దర్శకుడు మైండ్‌లో ఏముందో అదే పెట్టాలి అన్నట్లుగా వారు కూడా దర్శకుడికి వంత పాడేశారు.
సినిమా నిడివి విషయంలో అనవసరమైన సీన్లు, అక్కరలేని సీన్లు చాలా ఉన్నాయనిపించింది. కెమెరా పరంగా వంక పెట్టడానికి ఏం లేదు. ఈ సినిమాకి ఒక రకంగా కెమెరానే బలం అని చెప్పుకోవాలి. ఇంకా ఇతర సాంకేతిక నిపుణులందరూ ఈ సినిమాకు వారేం చేయగలరో, ఓంరౌత్ ఏం చేయమన్నాడో అది చేసి పెట్టారు. నిర్మాతలు చాలా మంది ఉండటంతో.. తలాకొంత పెట్టుబడి పెట్టి పక్కన కూర్చున్నట్లున్నారు. ఎందుకంటే.. ఈ సినిమాకి దర్శకుడు ఓం రౌత్ కూడా ఒక నిర్మాత. ఆయన అంతకుముందు తీసిన ‘తానాజీ’ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లుగా అయితే తెలుస్తుంది.
ఎందుకంటే ఈ సినిమా నిర్మాణానికి ముందు అనుకున్న బడ్జెట్ వేరు.. ఫైనల్‌గా ఖర్చయింది వేరు. మరి అంత ఎందుకు అయ్యింది అనేది? ఓంరౌత్‌కే తెలియాలి. ఎందుకంటే.. 20, 30 సంవత్సరాల క్రితమే మన తెలుగు దర్శకుడు కోడి రామకృష్ణ అద్భుతాలను సృష్టించారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉండి కూడా, అడిగినంత డబ్బు పెట్టే నిర్మాతలు ఉండి కూడా ఓం రౌత్.. మెరుపులు మెరిపించలేక పోయాడంటే.. అది ఎక్కడ తేడానో ఆయనకే తెలియాలి. అంత డబ్బు సుమారు రూ. 500 కోట్లు అంటున్నారు.. అవన్నీ ఏమయ్యాయో? అన్ని కోట్లు పెట్టిన వారికైనా తెలిసుండాలి.
విశ్లేషణ:
‘రామాయణం’ అందరూ ఆరాధించే గాథే. కానీ సినిమాటిక్ లిబర్టీ కోసం.. ఓం రౌత్ చేసిన ప్రయోగం.. అంచనాలను అందుకోక పోగా.. పలు విమర్శలకు తావిచ్చేలా ఉంది. అయితే ముందే ఓ స్టేట్‌మెంట్ ఇచ్చేసి ఓంరౌత్ సేవ్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అసలైన వాల్మీకి రామాయణం గురించి తెలుసు కోవాలంటే పండితుల్ని, సాహిత్యకారుల్ని సంప్రదించాలని చెప్పి సినిమాని ప్రారంభించి.. ఇది తను సృష్టించిన రామాయణంగా క్లారిటీ ఇచ్చాడు. అయితే రామాయణంలో ఎక్కడా లేని కొన్ని పాత్రలను, సన్నివేశాలను ఆయన సృష్టించిన తీరు మాత్రం అస్సలు నప్పలేదు సరికదా.. ప్రతి ఒక్కరితో మాట పడేలా చేస్తుంది. దీనిని ‘రామాయణం’ అని కాకుండా.. ఓంరౌత్ పైత్యాయణం అని పబ్లిసిటీ చేసి ఉంటే బాగుండేది.
లంకేశ్ దీక్షని మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరాలు ఇవ్వడం వంటి సన్నివేశాన్ని కూడా సరికొత్తగా చెప్పాలని ట్రై చేశాడు దర్శకుడు కానీ.. అక్కడో ఘోర తప్పిదమే జరిగినట్లుగా ఆల్రెడీ రామాయణం తెలిసిన వారికి తెలుస్తుంది. అక్కడి నుంచి అందరికీ తెలిసిన సన్నివేశాలే నడుస్తుంటాయి. ఈ సన్నివేశాలకు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్న దర్శకుడు.. కమర్షియల్ సినిమాలకు ఆలోచించినట్లే ప్రభాస్‌తో మాస్ ఎంట్రీ ఇప్పించేశాడు.
Adi Purush | ఆదిపురుష్ సినిమా నిమిషం ఆలస్యం.. థియేటర్‌ను ధ్వంసం చేసిన ప్రభాస్ ఫ్యాన్స్
లేడి మాయ, జానకిని లంకేశ్ అపహరించడం, రాఘవుడు జానకి జాడ కోసం ప్రయత్నాలు చేయడం, అన్నదమ్ములైన వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం, హనుమంతుడి ఆగమనం, జానకి కోసం వెతుకులాట, లంక, జానకి జాడ తెలియడం, లంకని వానర సైన్యంతో చుట్టుముట్టడం, విభీషణుడి సహయం, రాఘవ్ లంకేశ్‌ల మధ్య యుద్ధం.. ఇలా అన్ని తెలిసిన సన్నివేశాలే కళ్లముందు వస్తుంటాయి కానీ.. అంతగా కనెక్ట్ కావు. జానకీ సంహారం అంటూ చేసిన సన్నివేశం అస్సలు రుచింపదు.
అలాగే జానకి, రాఘవుల మధ్య ఎడబాటులోని గాఢమైన సంఘర్షణను చూపించడంలో దర్శకుడు సక్సెస్ కాలేక పోయాడు. ఆ సన్నివేశాలన్నీ నార్మల్ షూటింగ్‌ని తలపిస్తాయి. రామ లక్ష్మణుల బంధాన్ని, అలాగే రామాంజనీయుల మధ్య ఉన్న అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా పండించలేకపోయారు. ఇక లంకేశ్ పాత్ర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పెద్ద పెద్ద అనకొండలతో మసాజ్, దశ కంఠాలను చూపించిన విధానం, అతని నిక్కబొడుచుకునే హెయిల్ స్టైల్ ఇలా ఒక్కటేమిటీ.. రామ బాణంతో లంకేశ్‌ని రాఘవుడు చంపకుండానే.. ఆ పాత్రని ఓం రౌత్ కిల్ చేసేశాడు.
హాలీవుడ్ తరహాలో మలిచానని ఓంరౌత్ అనుకుంటున్న యాక్షన్ సన్నివేశాల్లో హడావుడి తప్ప ఏం లేదనిపిస్తాయి. అవే ఈ సినిమాకు మైనస్ అని చెప్పుకోవాలి. విజువల్‌గా వండర్స్ చేసే అవకాశం ఉన్న కథని.. పిల్లలు ఆడుకునే వీడియో గేమ్ మాదిరిగా మార్చేశాడు. హనుమం తుడి గెటప్ తప్పితే.. వానరసైన్యంలోని ఏ ఒక్కరి గెటప్‌ని అసలు ఊహించుకోలేం. ఒకానొక సందర్భంలో వచ్చే ఓ ఫేస్‌ని చూస్తే.. టాలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ హీరో గుర్తొచ్చేస్తాడు. అంతలా ఆ హీరోని ఓంరౌత్ అవమానించాడు.
ఇది కావాలని చేసింది కాకపోయినా.. కాస్త చూసుకోవాలి కదా. ఆ స్టార్ హీరో ఎవరనేది ఇక్కడ చెప్పడం లేదు కానీ.. సోషల్ మీడియాలో అది తొందరగానే రివీలవుతుంది. ఇక పైన ఎందుకు ఈ రెండు కాండములనే ఓం రౌత్ ఎంచుకున్నాడనే విషయానికి వస్తే.. వీటిలో నేటి తరానికి నచ్చే అంశాలను కమర్షియల్‌గా చెప్పే ఛాన్స్ ఉంది. అందుకే వాటిపైనే ఫోకస్ చేశాడు.
కానీ.. ఆధునీకత పేరుతో ఏదేదో చేసుకుంటూ పోయాడు. నేటి తరం పిల్లల కోసం ఒక వీడియో గేమ్ లాంటి సినిమా అని చెప్పుకోవడానికి తప్పితే.. ‘రామాయణ’ ఇతిహాసానికి చెందిన సినిమాగా దీనిని ప్రొజెక్ట్ చేయడం నిజంగా పాపమే అవుతుంది. ఈ పాపం చూసిన వారంతా.. వెంటనే ఇంటికెళ్లి ఏ ‘సంపూర్ణ రామాయణం’ సినిమానో చూసి ప్రక్షాళన చేసుకోక తప్పదు.
రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌తో.. రికార్డులన్నీ బద్దలవుతాయని అనుకున్నారు కానీ.. చూసిన తర్వాత ఈ వీడియో గేమ్ ట్రిక్స్‌కి అంత సీన్ లేదని.. అంతా ఫిక్స్ అయిపోతారు. ‘జై శ్రీరామ్’ నినాదమో.. లేదంటే ఈ సినిమాని వెనకుండి నడిపించిన శక్తులేమైనా బల్క్‌గా టికెట్లు కొనేసి అందరికీ ఈ సినిమాని చూపించడమో చేస్తే మాత్రం.. ‘ఆదిపురుష్’ ఇంకొన్ని రోజుల పాటు వార్తలలో ఉండే అవకాశం ఉంది. అంతే తప్ప అంతకు మించి చెప్పుకోవడానికి ఏం లేదు.
ట్యాగ్‌లైన్: ‘రామాయణం’ కాదు.. పిల్లలు కోసం చేసిన వీడియో గేమ్
రేటింగ్: 2/5