Narayana Institutions | నారాయణ విద్యాసంస్థల వ్యాపారంపై ఏఐఎస్‌ఎఫ్ పోరుబాట

Narayana Institutions | నారాయణ విద్యాసంస్థల విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని ఏఐఎస్ ఎఫ్ డిమాండ్ చేసింది. విద్యాశాఖ అధికారులు నారాయణ విద్యాసంస్థలకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించింది. ఈ మేరకు మంగళవారం రంగారెడ్డి జిల్లా మాదాపూర్ చంద్రనాయక్ తండా లో, హైదరాబాద్, నారాయణగూడలో అనుమతి లేకుండా అకాడమీ పేరుతో తరగతులు నిర్వహిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్న నారాయణ విద్యాసంస్థల ముందు ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో అనుమతి లేకుండా తరగతులు నిర్వహిస్తున్న నారాయణ విద్యాసంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేసింది. రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోకుండా మాటలు దాట వేసే ప్రయత్నం చేశారని ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు.
విచ్చలవిడిగా అనుమతులు లేకుండా లక్షలాధి రూపాయల ఫీజులు వసూలు చేస్తూ, విద్యాసంస్థల లోనే పుస్తకాలు, యూనిఫాంలు అమ్ముతున్న నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకుండా విద్యాశాఖ అధికారులు నారాయణ విద్యాసంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. అనుమతి లేని నారాయణ విద్యాసంస్థలను అధికారులు వెంటనే గుర్తించి వాటి పేర్లు బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. నారాయణ పాఠశాలల్లో స్టేషనరీ వస్తువులను అమ్ముతూ విద్యను వ్యాపారంగా మార్చారన్నారు. నారాయణ విద్యాసంస్థలు ఎక్కడ కూడా నిబంధనలు పాటించడం లేదని, ఫీజులు నియంత్రణ చట్టం అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. అధికారులు నారాయణ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారుల కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి గ్యార నరేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సామిడి వంశివర్ధన్ రెడ్డి, చైతన్య యాదవ్, ఎండి అన్వర్, రాష్ట్ర నాయకులు అరుణ్, హరీష్, అనిల్, ఉదయ్, భార్గవ్,అశ్వన్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.