Operation Kagar | లొంగిపోకపోతే అంతం చేస్తాం.. ఆపరేషన్ కగార్ ఆపేది లేదు : హోం మంత్రి అమిత్ షా

మావోయిస్టుల నిర్మూలనకు చేపట్టిన ఆపరేషన్ కగార్ నిలిపివేయబోమని..2026 మార్చ్ 31 వరకు మావోయిస్ట్ ముక్త్ భారత్ ను స్థాపించి తీరుతాం అని అమిత్ షా పునరుద్ఘాటించారు. మావోయిస్టులు హింసామార్గం వదిలి రావాలని.. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.

  • By: TAAZ    news    Jun 29, 2025 7:47 PM IST
Operation Kagar | లొంగిపోకపోతే అంతం చేస్తాం.. ఆపరేషన్ కగార్ ఆపేది లేదు : హోం మంత్రి అమిత్ షా

Operation Kagar | విధాత : ఆపరేషన్ కగార్ ఆపేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆదివారం నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించారు. అనంతర ఏర్పాటు చేసిన కిసాన్ సభలో ఆయన ప్రసంగించారు. నక్సలైట్లను ఏరిపారేయలా వద్దా అని సభలో ప్రజలను ప్రశ్నించారు? మావోయిస్టుల నిర్మూలనకు చేపట్టిన ఆపరేషన్ కగార్ నిలిపివేయబోమని..2026 మార్చ్ 31 వరకు మావోయిస్ట్ ముక్త్ భారత్ ను స్థాపించి తీరుతాం అని అమిత్ షా పునరుద్ఘాటించారు. మావోయిస్టులు హింసామార్గం వదిలి రావాలని.. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. లేదంటే మావోయిస్టుల వేట కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే 10వేల మంది నక్సలైట్లు లొంగిపోయారని.. జన జీవన స్రవంతిలోకి వచ్చేశారన్నారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు.. దేశంలోని నక్సలిజం కూడా లేకుండా చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని పునరుద్ఘాటించారు. పహల్గాంలో ఉగ్రదాడితో పాకిస్థాన్‌ మనల్ని భయపెట్టాలని చూసిందన్నారు. ఆపరేషన్ సిందూర్ తో భారత్ శక్తి ఏమిటో పాకిస్తాన్ సహా ప్రపంచానికి తెలిసిందన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ ఆధారాలు అడుగుతున్నారని.. పాకిస్థాన్‌ మాట రాహుల్‌గాంధీ నోట వినబడుతోందని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయం అని తెలుస్తోందన్నారు. మోదీ ప్రధాని అయ్యాక తీవ్ర వాదుల ఆటకట్టించారన్నారు. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతి కి పాల్పడిందని, ధరణి.. కాళేశ్వరాన్ని కేసీఆర్ ఫ్యామిలీ ఏటీఎం గా మార్చుకుందని ఇపుడు రేవంత్ సర్కార్ ఢిల్లీ కి ఏటీఎం గా మారిందని ఆరోపించారు.

పసుపు పంటకు నిజామాబాద్ క్యాపిటల్ సిటీ లాంటిది

40 ఏళ్లుగా పసుపు బోర్డు కోసం పోరాడుతున్న రైతుల కల నేరవేరిందని, నిజామాబాద్ పసుపు పంటకు రాజధాని లాంటిదని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. తన చేతుల మీదుగా పసుపు బోర్డు ప్రారంభం కావడం అదృష్టంగా ఉందన్న అమిత్ షా.. పసుపు రైతులకు ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు ఏర్పాటు చేశామన్నారు. ఈ రోజు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పసుపు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హామి ఇచ్చారు. దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి పసుపు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పసుపు దివ్య ఔషధం లాంటిదని ఈ సంపద నిజామాబాద్ నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుందని తెలిపారు అమిత్ షా.. కార్యక్రమంలో అమిత్ షాతో పాటు రాష్ట్ర మంత్రులు తుమ్మల, సీతక్క, ఎంపీలు అరవింద్, లక్ష్మణ్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు పాల్గొన్నారు.