Operation Kagar | బీజాపూర్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టుల మృతి

  • By: TAAZ    news    Jun 07, 2025 4:40 PM IST
Operation Kagar | బీజాపూర్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టుల మృతి

Operation Kagar | ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శనివారం మరో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని బస్తర్‌ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ పీ పీ సుందర్‌రాజ్‌ ధృవీకరించారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నేషనల్ పార్క్ సమీపంలో గత రెండు రోజులుగా వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. శనివారం మూడో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇప్పటివరకు ఇద్దరు ముఖ్య నేతలు మృతి చెందగా శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందడంతో మొత్తం ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. మావోయిస్టులకు సాయిధ బలగాలకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

పోలీసుల అదుపులో పది మంది మావోయిస్టులు!

మావోయిస్టు పార్టీకి చెందిన పదిమంది సభ్యులను బీజాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల సంఘం నాయకులు శుక్రవారం ఆరోపించిన విషయం తెలిసిందే. తమ అదుపులో ఉన్న మావోయిస్టులను ఎదురుకాల్పుల పేరుతో విడతలవారీగా హత్య చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గౌతమ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ మృతి చెందారని చెబుతున్నారు. తాజాగా మృతి చెందిన ఐదుగురు మావోయిస్టులకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. వివరాలు తెలిస్తే ఏ స్థాయి నాయకుడు మృతి చెందారు అనేది స్పష్టం కానున్నది.

హిడ్మా లక్ష్యంగా సెర్చ్‌ ఆపరేషన్‌

నేషనల్ పార్క్ కేంద్రంగా చేసుకొని మావోయిస్టు పార్టీ కీలక నేత పీఎల్‌జీఏ మొదటి బెటాలియన్ కమాండర్ మడవి హిడ్మా ఉన్నాడనే సమాచారం మేరకు ఆయన లక్ష్యంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నది. గత కొన్ని యేళ్లుగా రహస్యంగా ఉన్న హిడ్మాకు సంబంధించిన తాజా ఫోటో కూడా ఇటీవల సైనిక బలగాల చేతికి చిక్కింది. ఈ నేపథ్యంలోనే సైనిక బలగాలకు కొరకరాని కొయ్యగా మారిన హిడ్మాను అంతమొందించడమే లక్ష్యంగా సాయుధ బలగాలు తమ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని సమాచారం. కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజులుగా ప్రకటిస్తునట్లు మావోయిస్టుల సమూల నిర్మూలనే లక్ష్యంగా సైనిక బలగల కూంబింగ్ కొనసాగుతోంది. ఈ సెర్చ్ ఆపరేషన్ మరో రెండు మూడు రోజులపాటు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మరో 30 నుంచి 40 మంది మావోయిస్టులు ఉన్నట్టు పోలీసు బలగాలు భావిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..

Operation Kagar | పచ్చటి అడవుల్లో వెచ్చని నెత్తుళ్లు! వరుస ఎన్‌కౌంటర్లలో నేలకొరుగుతున్న మావోయిస్టు నేతలు
Operation Kagar | నంబాల ఎన్‌కౌంటర్‌ జరిగిందిలా.. పాయింట్‌ టూ పాయింట్‌ వివరించిన మావోయిస్టు లేఖ