Chandrababu Naidu | సీబీఎన్ సీఎంగా ఉంటే క్రిమినల్స్ ఉండరు.. : ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu | యువత ఎప్పటికప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకొని ఏఐ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారి సత్తా చాటలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. థింక్ గ్లోబల్లీ.. యాక్ట్ గ్లోబల్లీ అని యువతకు సూచించారు. శుక్రవారం గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమలో పాల్గొన్న చంద్రబాబు పోలీసు ఏఐ హ్యాకథాన్ ను ప్రారంభించారు. ఐటీ కంపెనీలు, ఏఐ నిపుణులతో సమావేశం తరువాత ఏపీ సీఎం మాట్లాడారు. సీబీఎన్ సీఎంగా ఉన్న కాలం నేరస్తులకు రాష్ట్రంలో చోటు లేదని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజం, రౌడీయిజం, స్మగ్లర్లను కట్టడి చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం సాంకేతికతతో పాటు సంఘ విద్రోహశక్తులపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.
తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రంగా ఎదగడానికి కారణం ఐటీ అని తెలిపారు. శాంతి భద్రతలు సక్రమంగా ఉంటేనే అభివృద్ధి జరుతుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. క్వాంటమ్ వ్యాలీలో ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్) కి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయనేది కేవలం అపోహ మాత్రమేనన్నారు. రాబోయే రోజుల్లో హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ చేస్తే ప్రపంచాన్ని జయించే పరిస్థితి వస్తుందని సూచించారు ఏపీ సీఎం. దేశంలో తొలిసారిగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీనీ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.