Bandi Sanjay: వారిది.. దొంగల ముఠా సమావేశం: కేంద్ర మంత్రి బండి సంజయ్

Bandi Sanjay:
విధాత : చెన్నైలో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా జరిగిన సమావేశంపై బండి సంజయ్ (Bandi Sanjay) ఫైర్ అయ్యారు. చెన్నైలో జరిగింది డీలిమిటేషన్ వ్యతిరేక సమావేశం కాదని…దొంగల ముఠా…మాఫియా ముఠా సమావేశమని విమర్శించారు. లిక్కర్ స్కామ్, ల్యాండ్ స్కామ్ ముఠాలు అక్కడ భేటీ అయ్యాయన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని కేసుల నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ సహకరిస్తోందని సంజయ్ ఆరోపించారు. ఢిల్లీలో కలిసి ఉంటారు.. గల్లీలో కొట్లాడుకుంటారన్నారు. డీఎంకే భేటీకి రెండు పార్టీలు వెళ్లాయంటే…వారు ఇద్దరూ ఒక్కటా? కాదా? కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక్క నోటీసు కూడా ఇవ్వట్లేదని గుర్తు చేశారు.
డీలిమిటేషన్ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదని..దీని పేరుతో రాజకీయం చేస్తూ ఆరు గ్యారంటీల హామీల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందన్నారు. తమిళనాడులో డీఎంకే రూ.వెయ్యి కోట్ల మద్యం కుంభకోణం చేసిందని.. డీఎంకేను సాగనంపేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని సంజయ్ పేర్కొన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు పక్కా ప్రణాళికతో ఇదంతా చేస్తున్నారన్నారు. దక్షిణాదిలో సీట్ల సంఖ్య తగ్గించబోమని అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ చెప్పారని.. డీలిమిటేషన్ (Delimitation) కు ఎలాంటి నియమ నిబంధనలు పెట్టలేదని చెప్పారు. తమతమ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీని రాజకీయంగా ఎదుర్కోనే వ్యూహంలో కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు డీలిమిటేషన్ పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని బండి సంజయ్ స్పష్టం చేశారు. పదేళ్లుగా వడగళ్ల వానతో నష్టోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో సమీక్షలు, సర్వేలు, నివేదికల పేరుతో కాలం గడిపారన్నారు. సర్వే చేసి వారం రోజుల్లో తాజాగా వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెలిపారు.