Bhatti Vikramarka | తెలంగాణలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : భట్టివిక్రమార్క

కాంగ్రెస్‌ ప్రభుత్వం వైద్య శాఖకు 11,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని భట్టివిక్రమార్క వివరించారు. రాబోయే రోజుల్లో ఈ రంగానికి మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. మొదటి విడుతలో నియోజకవర్గానికి 3500 ఇండ్లు కేటాయిస్తున్నామని, ఇందుకు 22,500 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు.

  • By: TAAZ    news    May 14, 2025 7:57 PM IST
Bhatti Vikramarka | తెలంగాణలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : భట్టివిక్రమార్క

Bhatti Vikramarka |  కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని చెప్పారు. బీఆరెస్ పదేండ్లపాటు ఇండ్లు ఇస్తామని పేదలను మోసం చేసిందని ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని బీఆరెస్ అప్పుల కుప్ప చేసిందన్నారు. ఏడు లక్షల కోట్లు అప్పుల చేసి రాష్ట్రాన్ని తమ చేతిలో పెట్టారని విమర్శించారు. ఆ అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. బుధవారం ఆయన మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రాజీవ్ యువ వికాసం, రేషన్ లో సన్న బియ్యం ఇలా అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నాని చెప్పారు. ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి ఏయే సంక్షేమ పథకాలు అమలు చేశామో త్వరలోనే లెక్కలతో సహా వివరిస్తామన్నారు.

వైద్యశాఖకు 11,600 కోట్లు

కాంగ్రెస్‌ ప్రభుత్వం వైద్య శాఖకు 11,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని భట్టివిక్రమార్క వివరించారు. రాబోయే రోజుల్లో ఈ రంగానికి మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. మొదటి విడుతలో నియోజకవర్గానికి 3500 ఇండ్లు కేటాయిస్తున్నామని, ఇందుకు 22,500 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. అటవీహక్కు చట్టం ద్వారా పట్టా పొందిన రైతులందరికీ ఇందిరా గిరి జలవికాసం ద్వారా ఉచితంగా బోర్లు, పంప్ సెట్లు, సోలార్ విద్యుత్తు, పామ్ ఆయిల్, అవకాడో మొక్కలు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. అందులో భాగంగా మొదటి సంవత్సరం స్వయం సహాయక సంఘాలకు 21 వేల కోట్లు అందజేశామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి 10 లక్షలకు పెంచామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా స్కూల్ నిర్మిస్తామన్నారు. వాటికోసం 11,600 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని.. మరో 30 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నామన్నారు. యువత స్వయం ఉపాధి కల్పించేందుకు 9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించామని, జూన్ 2న సాంక్షన్ లెటర్లు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ప్రయోజనం చేకూరుతుందనీ డిప్యూటీ సీఎం అన్నారు.