Janagaon: ఆదుకోండి.. లేదా నా కొడుకును చంపేయండి: తల్లి వేదన! వెంట‌నే స్పందించిన సీఎం రేవంత్‌

  • By: sr    news    Apr 30, 2025 6:00 AM IST
Janagaon: ఆదుకోండి.. లేదా నా కొడుకును చంపేయండి: తల్లి వేదన! వెంట‌నే స్పందించిన సీఎం రేవంత్‌

Janagaon:

విధాత : కన్న ప్రేమ ముందు కొడుకు ఎలా ఉన్నా తల్లికి భారం కాదు. కాళ్లూ, చేతులు చచ్చుబడిన కొడుకును ఆ తల్లి 30 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తాజాగా ప్రభుత్వ సాయాన్ని అర్థిస్తూ జనగామ కలెక్టరేట్‌కు వెళ్లింది. అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో కన్నీటిపర్యంతమైంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. జనగామకు చెందిన లక్ష్మి అనే మహిళకు దివ్యాంగుడైన కుమారుడి పోషణ భారంగా మారింది.

30ఏళ్ల వయసున్న కుమారుడు ఏ తల్లిదండ్రులకైనా చేదోడు వాదోడుగా ఉంటాడు. కాని ఆ నిర్భాగ్యురాలైన తల్లి తన దివ్యాంగ కుమారుడిని నిత్యం పసిపాపలా సాకాల్సిన దీనస్థితిని వెళ్లదీస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న రూ. 4000 పెన్షన్ డైపర్లకే సరిపోవట్లేదని..మరేదైన సహాయం చేయాలని ఆ తల్లి జనగామ కలెక్టరేట్ కు వచ్చి అధికారులను వేడుకుంది.

తనకు ఇందిరమ్మ ఇల్లు, జీరో కరెంటు బిల్లు పథకాలు అందడం లేదని..కూలీ పనులకు వెళ్లే మేం పథకాలకు అర్హులం కాదా అని ఆ అభాగ్యురాలు అధికారులను ప్రశ్నిస్తుంది. ప్రభుత్వం యంత్రాంగం మమ్మల్ని ఆదుకోవాలని లేదంటే నా కొడుకును చంపేయండి’ అని ఆ తల్లి కలెక్టరేట్ ప్రాంగణంలో కన్నీరు మున్నీరైంది. ఆ తల్లి కుమారుల దీన స్థితిని చూసిన పలువురు చలించిపోయారు. ప్రభుత్వం వారికి ఆదుకోవాలని కోరారు.

స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

జనగామ కుర్మవాడకు చెందిన పర్శ సాయి దీన పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి తన దృష్టికి వచ్చిందని ఎక్స్ లో పోస్ట్ చేసి ప్రభుత్వం నుంచి చేయగలిగిన సాయం అందించాలని అధికారులకు సీఎం ఆదేశ‌ఙంచారు.

దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వెంట‌నే రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పర్శ సాయి ఇంటికి వెళ్లి ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆపై సాయికి నిమ్స్ లో వైద్య సాయం అందించడానికి నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిపారు.