Banakacharla Project | బనకచర్ల పాపం కేసీఆర్‌దే : మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌

  • By: TAAZ    news    Jun 18, 2025 9:56 PM IST
Banakacharla Project | బనకచర్ల పాపం కేసీఆర్‌దే : మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌

Banakacharla Project | భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అన్నట్టు ప్రధాని నరేంద్ర మోదీకి, ఏపీ సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు అవసరం ఉంది.. చంద్రబాబుకి గోదావరి జలాల అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు మద్దతుపై కేంద్ర ప్రభుత్వం కొనసాగుతున్నదని, అందుకే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ఇవ్వాల్టి అఖిలపక్షం సమావేశానికి రాలేదని ఆరోపించారు. చంద్రబాబు.. దూరం పెంచుకుంటే సమస్య పరిష్కారం కాదు.. ప్రధాన నరేంద్ర మోదీ దగ్గర అనుమతులు తెచ్చుకున్నంత మాత్రాన మీ ప్రాజెక్టులు పూర్తికావని స్పష్టం చేశారు. బనకచర్లపై అఖిలపక్ష ఎంపీల భేటీ తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.  ‘2016 సెప్టెంబర్ 21వన ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆనాటి సాగునీరు మంత్రి హరీష్ రావు, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. 8 పేజీల మీటింగ్ మినిట్స్ రికార్డు చేసి, 3 వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని కేసీఆర్ ప్రతిపాదన పెట్టారు. ఏపీలోని రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని ఆ సమావేశంలోనే పునాది పడింది’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. 2019 వరకు ఇది రకరకాల కారణాలతో వాయిదాపడుతూ వచ్చిందన్నారు. ‘2019 లో ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి తో నాలుగుసార్లు సమావేశమైన కేసీఆర్, రాయలసీమకు నీటి తరలిపునకు నిర్ణయం తీసుకున్నారు. ఆ సమావేశం వివరాలను ఆనాటి మంత్రులు ఈటల రాజేందర్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంయుక్తంగా మీడియా సమావేశం పెట్టి వివరించారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ఆనాడు కేసీఆర్ మాట్లాడారు. గోదావరి – బనకచర్ల విషయంలో 2016లో అప్పటి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు నాయుడు మాట్లాడుకున్న అంశాల సాకుతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకువెళుతోంది. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని కేసీఆర్ ఆనాడు మాట్లాడారు’ అని రేవంత్‌ తెలిపారు.

అది 300 టీఎంసీల ప్రాజెక్ట్‌

ఏపీ చేపట్టేది 200 టీఎంసీ ప్రాజెక్టు కాదు 300 టీఎంసీల కోసం అని, ఆనాడు కేసీఆర్ 400 టీఎంసీలు తీసుకోవచ్చని అంగీకరించారని రేవంత్‌రెడ్డి వివరించారు. తాము వాదనలకు వెళ్లదలచుకోలేదని, అందుకే తెలంగాణకు నష్టం జరగొద్దని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు పిర్యాదు చేశామని తెలిపారు. గోదావరి జలాల విషయంలో తమ ప్రభుత్వం ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదన్నారు. ఉన్నపళంగా హరీష్‌రావు బకెట్లో బురద తీసుకుని తమపై చల్లాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. హరీష్ రావు.. ఈ పాపానికి కారకుడు మీ మామనే, పాపాల భైరవులు మీరు అని, కాంట్రాక్టర్ పెట్టిన సమావేశంలో కమీషన్లకు కక్కుర్తి పడి కుట్రలు చేశారని ఆరోపించారు.

గ్రావిటీతో సాగునీరు ఇచ్చే చాన్స్‌

తుమ్మిడిహెట్టి వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే గ్రావిటీతో సాగునీరు అందేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. కమీషన్ల కక్కుర్తితో లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు కూడా సాగు నీరు అందివ్వలేదన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే పెండింగ్ ప్రాజెక్టులను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఎస్ఎల్బీసీ పనులు ప్రారంభించిన సందర్భంలో కూలీలు, ఇంజినీర్లు చనిపోతే వాళ్ళు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇవాళ మేం నిజాలు బయటపెట్టాం.. తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? సాగునీటి ప్రాజెక్టులు, మెట్రో రైలు విస్తరణ, రీజనల్ రింగురోడ్డు, మూసీ ప్రక్షాళన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలవొద్దా? మీరు నిధులు ఇస్తామంటే చెప్పండి.. ఎర్రవల్లిలోని మీ ఫామ్ హౌస్‌కేవస్తాం.. రూ.50 వేల కోట్లు అప్పు ఇవ్వండి.. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాండ్లు సమర్పిస్తాం’ అని ఎద్దేవా చేశారు.

బనకచర్ల విషయంలో శషభిషలు లేవు

బనకచర్ల విషయంలో మాకు ఎలాంటి శషభిషలు లేవని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. సామ, దాన, దండోపాయాల్లో మొదటి దశలో ఉన్నామని అన్నారు. అందరినీ కలిసి సమస్యలను వివరిస్తామని, అయినా న్యాయం జరగకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు. కేంద్రంలో పలుకుబడి ఉందని ప్రాజెక్టులు పూర్తవుతాయనుకుంటే మీ భ్రమే అని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకు మా ప్రణాళిక మాకుంది. చంద్రబాబు.. కెసీఆర్ చెప్పారని కాదు.. గోదావరి బేసిన్ లో 3వేల టీఎంసీలు మిగులు జలాలు ఉన్నాయని మీరు నమ్మితే 968 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు సంపూర్ణ అనుమతులు ఇచ్చాక మీరు మిగులు జలాలు తీసుకోండి’ అన్నారు. కేసీఆర్ తెలంగాణకు చేసిన తీరని ద్రోహం వల్లే ఏపీకి నీళ్లు వెళుతున్నాయని చెప్పారు. ‘మేడిగడ్డ గుండెకాయ లాంటిది.. అది లేకపోతే ఆ ప్రాజెక్టు ఉన్నా ప్రయోజనం లేదు. గత పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే తెలంగాణకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు’ అని చెప్పారు. ‘కృష్ణానది జలాలు జూరాలలో తెలంగాణకు వస్తాయి. ఆ నీటిని వాడుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. దీనికి కారణం కేసీఆర్ కాదా? రాయలసీమ ప్రాజెక్టులకు మీరే కదా ఒప్పుకున్నది?’ అని ఆయన నిలదీశారు. కేసీఆర్ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న నమస్తే తెలంగాణ దినపత్రిక రాష్ట్రానికి పట్టిన చీడ పీడ అని రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.