CPI | విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పదేళ్ల పరిపాలనలో పేదలకు సెంటు భూమి ఇవ్వడానికి చేతకాని బీఆర్ఎస్ పాలనకు తగిన బుద్ధి చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సోమవారం మానుకోట జిల్లా కురవి శివారులో జరిగిన గుడిసెవాసుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అరుణ పతాకాన్ని ఎగరవేసి, అనంతరం సమావేశంలో మాట్లాడారు.
ఓట్ల జిమిక్కులతో కేసీఆర్ గృహలక్ష్మి, దళిత బంధు, బీసీ రుణాల పేరిట హడావుడి చేస్తూ, సర్వేలు నిర్వహిస్తూ దొడ్డిదారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సిఫారసు మేరకే అతి కొద్ది మందికి మంజూరి చేయడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. పదేళ్ల పాలనలో గుర్తుకురాని సంక్షేమ పథకాలు, ఓట్ల ముందర ప్రజలను దగాచేసి మరొకసారి అధికారం చేపట్టడానికి అడ్డమైనదారులు తొక్కే కుయుక్తులకు కేసీఆర్ పాల్పడారని విమర్శించారు.
ప్రజలు తమ రాజకీయ చైతన్యంతో వీటిని తిప్పికొడతారని అన్నారు. పేదలకు జాగదక్కేవరకు సీపీఐ నిరంతర పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి బీ విజయ సారధి, డోర్నకల్ నియోజకవర్గ కార్యదర్శి నల్ల సుధాకర్ రెడ్డి, మండల కార్యదర్శి కరణం రాజన్న, పోగుల శ్రీనివాస్ గౌడ్, బుర్ర సమ్మయ్య, కన్నె వెంకన్న, బూర్గుల కృష్ణ , బొల్లం ఉప్పలయ్య, కలగూర నాగరాజు, అప్పాల వెంకన్న పాల్గొన్నారు.