కాలి వేళ్లతోనే డిగ్రీ పరీక్షలు..స్ఫూర్తిని చాటిన దివ్యాంగుడు!

కాలి వేళ్లతోనే డిగ్రీ పరీక్షలు..స్ఫూర్తిని చాటిన దివ్యాంగుడు!

విధాత, హైదరాబాద్: సంకల్పం ఉంటే..సాధించలేనిదేమి లేదంటారు పెద్దలు..అది అక్షరాల నిజమని చాటుతూ ఓ దివ్యాంగుడు తన కాలి వేళ్లతోనే డిగ్రీ పరీక్షలు రాసి సంకల్పబలం స్ఫూర్తిని చాటాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మంచిర్యాల (బీ) నెన్నల మండలం కృష్ణపల్లికి చెందిన ఎల్లూరి శంకర్ కు రెండు చేతులు లేవు. అయితే ఉన్నత చదువులు చదవాలన్న తపన..పట్టభద్రుడు కావాలన్న పట్టుదల అతడిని కాలి వేళ్లతోనే డిగ్రీ ఫైనలియర్ పరీక్షలు రాసేందుకు సంకల్ప బలమై నిలిచింది. అతను చిన్న తనంలోనే విద్యుత్తు షాక్ తో రెండు చేతులు కోల్పోయాడు. అయినా చేతులు లేవని ఎక్కడా డీలా పడకుండా..చదువును అశ్రద్ధ చేయకుండా చదువును కొనసాగించాడు.

కాకతీయ యూనివర్సిటీ బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ ఫైనలియర్ విద్యార్థిగా పరీక్షల్లో సహచర విద్యార్థులతో కలిసి బెంచీపై కూర్చుని కాలి వెళ్లతో పరీక్ష రాశాడు. దివ్యాంగులకు ఉన్న సహాయకుడి నియామకం(స్క్రైబ్) అవకాశం కూడా వద్దనుకుని స్వయంగా కాలి వేళ్లతోనే పెన్ను పట్టి పరీక్షలు రాశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారగా..నెటిజన్లు అతడి సంకల్ప బలాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఓ సినీ కవి చెప్పినట్లుగా నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి అన్న గేయాన్ని వారు శంకర్ సంకల్పంతో పోల్చుతు అభినందిస్తున్నారు.