Gold: విదేశాల నుంచి.. ఎంత బంగారం తెచ్చుకోవచ్చో తెలుసా?

  • By: sr    news    Mar 07, 2025 6:06 PM IST
Gold: విదేశాల నుంచి.. ఎంత బంగారం తెచ్చుకోవచ్చో తెలుసా?

Gold:

విధాత: దుబాయి నుంచి 14.8 కిలోల బంగారాన్ని (Gold) తీసుకువస్తూ కన్నడ, తమిళ సినీనటి రన్యారావు బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆమె వద్ధ పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.12 కోట్ల రూపాయలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు విదేశాల నుంచి చట్ట ప్రకారం ఎంత బంగారం తెచ్చుకోవచ్చన్న ప్రశ్న అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.

అయితే.. బంగారం ధరలు తక్కువగా ఉన్న అరబ్ దేశాల నుంచి ఎక్కువగా స్మగ్లింగ్ జరుగుతోందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా దుబాయి, జోర్దాన్, కువైట్, సూడాన్ నుంచి అక్రమంగా తీసుకువస్తున్నారని గుర్తించారు. తక్కువ ధరకే దుబాయిలో కొనుగోలు చేసి తీసుకువచ్చి.. కస్టమ్స్ డ్యూటీ కట్టకుండా మార్కెట్లోకి తీసుకెళితే ఎక్కువ లాభాలు పొందవచ్చన్న ఆలోచనతో బంగారాన్ని అక్రమంగా వెంట తెస్తున్నారు.

 

దీనిపై కస్టమ్స్ నిబంధనలు ఏం చెబుతున్నాయన్న వివరాలలోకి వెళితే విదేశాల నుంచి అసలెంత బంగారాన్ని (Gold) ఉచితంగా తెచ్చుకోవచ్చు? నిబంధనలు ఏం చెబుతున్నాయో చూద్దాం. విదేశాల నుంచి బంగారం తీసుకురావడంపై ఎక్కడా ఆంక్షలు లేవు. మగ వారు 20 గ్రాములు, ఆడ వారు 40 గ్రాములు ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా తీసుకు రావచ్చు. కానీ కొందరు కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టడానికి అక్రమ పద్ధతులలో తీసుకు వస్తున్నారు. కొద్ది కాలం అక్కడ ఉండి కిలోల బంగారం అక్రమంగా తీసుకువస్తున్నారు.

కస్టమ్స్ డ్యూటీ చెల్లించకపోతేనే స్మగ్లింగ్ కిందనో.. అక్రమంగా తీసుకువస్తున్నట్లుగానో గుర్తించి సీజ్ చేస్తారు.  కిలోకు మించి తీసుకువస్తే అరెస్టు చేస్తారు. అయితే, కస్టమ్స్ ట్యాక్స్ రేట్లు భారత పౌరులు ఆ దేశాల్లో ఎంతకాలం ఉన్నారు.. ఎంత బరువైన బంగారం (Gold) తెచ్చారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. బంగారంపై కస్టమ్ డ్యూటీని ప్రభుత్వం గత ఏడాది 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. అలాగే, గోల్డ్ బార్‌పై ఈ డ్యూటీని 14.35 శాతం నుంచి 5.35 శాతానికి తగ్గించిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది.