నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా, రాహుల్ గాంధీలకు.. ఈడీ బిగ్ షాక్!

విధాత: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీట్లో సోనియా, రాహుల్ పేర్లను చేర్చింది. గాంధీ కుటుంబంపై ఇది తొలి చార్జిషీట్ కావడం విశేషం. ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ సామ్ పిట్రోడా, సుమన్ దూబేలతో పాటు మరికొంత పేర్లు చేర్చారు. ఈ కేసులో ఏప్రిల్ 25న రౌస్అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 లోని సెక్షన్ 44,45 ,సెక్షన్ 3 ,4, సెక్షన్ 70 కింద నేరానికి పాల్పడినందుకు ప్రాసిక్యూషన్ ఫిర్యాదు(చార్జిషీట్ )ను ఈడీ దాఖలు చేసింది.
ఏంటీ నేషనల్ హెరాల్డ్ కేసు..?
కాంగ్రెస్ పార్టీకి చెందిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్), దాని యాజమాన్య కంపెనీ యంగ్ ఇండియన్ కంపెనీపై మనీ లాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు పబ్లిషర్స్‌గా ఏజేఎల్ ఉండగా, యంగ్ ఇండియన్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి 38 శాతం చొప్పున మెజారిటీ షేర్లు ఉన్నాయి. కాంగ్రెస్‌కు ఏజేఎల్ బకాయి పడిన రూ.90 కోట్లను వసూలు చేసుకునే విషయంలో యంగ్ ఇండియన్ ఆర్థిక అవకతవకలతో సోనియా, రాహుల్ లకు ప్రయోజనం చేకూరేలా పనిచేసిందని ఈడీ ఆరోపిస్తున్నది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ ఏజేఎల్ కు చెందినరూ.661కోట్ల ఆస్తుల జప్తుకు నోటీసులు జారీ చేసింది. చార్జిషీట్‌పై ఈనెల 25న రౌస్అవెన్యూ కోర్టులో ఈడీ వాదనలు వినిపించనుంది.