Telangana: సచివాలయంలో.. నకిలీ ఉద్యోగి పట్టివేత !

  • By: sr    news    Apr 12, 2025 8:21 PM IST
Telangana: సచివాలయంలో.. నకిలీ ఉద్యోగి పట్టివేత !

విధాత: సచివాలయంలో నకిలీ ఉద్యోగుల వ్యవహారం మరోసారి కలకలం రేపింది. సమీర్ అనే నకిలీ ఉద్యోగిని సచివాలయం సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. సమీర్ తన వెర్నా కారుపై టీఎస్ సెక్రటేరియట్ ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అన్న స్టిక్కర్ వేసుకుని సచివాలయానికి రాకపోకలు సాగిస్తున్నాడు. తాను సచివాలయం ఉద్యోగినంటూ అందరిని మోసం చేస్తున్నాడు. అయితే అనుమానంతో పోలీసులు సమీర్ కారును ఆపి తనిఖీ చేశారు. దీంతో తాను సచివాలయ ఉద్యోగిని కాదని సమీర్ అంగీకరించాడు.

తాను సచివాలయంలో పైరవీలు చేస్తానని ఒప్పుకున్నాడు. వెంటనే పోలీసులు సమీర్ కారును సీజ్ చేసి అతనిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సమీర్ ను పట్టుకున్న సచివాలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దేవిదాస్ ను అధికారులు అభినందించారు. గతంలోనూ సచివాలయంలో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్నట్లుగా నకిలీ ఐడీ కార్డులతో సంచరిస్తున్న పలువురికి పోలీసులు గుర్తించడం గమనార్హం. ఇటీవల నకిలీ అధికారులు మంత్రులు, సీఎం సమావేశంలోనికి వెళ్లడం సంచలనం రేపింది.