గుల్జార్ హౌస్ విషాదం.. సర్కార్ నిర్లక్ష్యమేనా?

సీఎం పర్యవేక్షణలోనే డిజాస్టర్ మేనేజ్‌మెంట్
ప్రమాదానికి బాధ్యతగా పరిహారంతో సరి
విపత్తుల వేళ హైడ్రా ఫోకస్‌పై ప్రశ్నలు
డీఆర్ఎఫ్ సిబ్బందికి వసతుల కరువు
హైదరాబాద్, మే 19 (విధాత) : విశ్వనగరంగా విరాజిల్లుతున్న హైదరాబాద్ నగరంలో ఓ వైపు ప్రపంచ సుందరి ఎంపిక పోటీలు సాగుతున్న తరుణంలో ఓ అగ్ని ప్రమాదంలో 17మంది మృత్యువాత పడటం సహజంగానే రాష్ట్ర రాజధాని ప్రతిష్ఠను మసకబార్చింది. పాతబస్తీలో పేరెన్నికగన్న గుల్జార్ హౌస్ భవనంలో చెలరేగిన అగ్నిప్రమాదం తీవ్రత కంటే సహాయక చర్యల్లో డొల్లతనమే అధిక ప్రాణనష్టానికి బలమైన కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపత్తుల నిర్వహణ, నివారణకు సంబంధించిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం హోంశాఖ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ శాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణలోనే ఉంది. అంటే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వైఫల్యానికి బాధ్యత సహజంగానే సీఎం రేవంత్ రెడ్డి మీద ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించి.. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాతో సరిపెట్టారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఫైర్ టీమ్ తమ శక్తి యుక్తులు ప్రదర్శించిందని ప్రకటన చేశారు.
కనిపించని విపత్తు నిర్వహణ.. నివారణ చర్యలు
వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల నివారణ.. తదుపరి వచ్చే వర్షకాలం విపత్తులపై ముందుస్తు సమీక్షలు, సన్నాహాలు, మాక్ డ్రిల్స్ వంటివేవీ ఈ ఏడాది జీహెచ్ఎంసీలో కనిపించలేదు. అందరి దృష్టి పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం మొదలైన ఆపరేషన్ సిందూర్ పరిస్థితులు.. స్థానికంగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలపైనే ఉన్న తరుణంలో విపత్తుల నిర్వహణ.. నివారణ అంశాలపై నిర్లక్ష్యం ప్రబలినట్లయ్యింది. అది ఎంతగా అంటే.. కనీసం ఆంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్లు, ఫైర్ ఇంజిన్లలో నీళ్లు.. ఫైర్ బ్రిగేడ్‌కు సరైన మాస్కులు ఉంటే గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం తగ్గేదని బాధితులు పేర్కొనడమే నిదర్శనంగా చెప్పవచ్చు. లక్షన్నర కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో రాజధానిలో తలెత్తే విపత్తుల నివారణలోనే ప్రభుత్వం యంత్రాంగం విఫలమవ్వడం.. అది కూడా కనీస వసతులు లేక రెస్య్యూ ఆపరేషన్ వైఫల్యం చెందడం విచారకరమంటున్నారు నగర వాసులు.
హైడ్రాతో అంచనాలు తలకిందులు
జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రత్యేక ఫైర్ సేఫ్టీ వింగ్‌ను గతంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఈవీడీఎంకు బదిలీ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈవీడీఎం విభాగాన్ని హైడ్రాలో భాగంగా చేసేసింది. అయితే హైడ్రా ఏర్పాటు తర్వాత అందులో భాగమైన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విధులపై ఫోకస్ తగ్గి బుల్డోజర్లతో చెరువులు భూముల సంరక్షణ, ఆక్రమణల తొలగింపు, అక్రమ నిర్మాణాలు కూల్చివేతలే ప్రధాన లక్ష్యంగా మారిపోయింది. హైడ్రా, జీహెచ్‌ఎంసీలు కొన్ని నెలలుగా ఫైర్ సేఫ్టీపై కనీస సమీక్షలు చేయకపోవడంతో విపత్తుల నిర్వహణ.. నివారణ వ్యవహారాలు బలహీనపడిపోయాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అగ్ని ప్రమాదాలు తలెత్తే ప్రమాదమున్న భవనాలు.. నిర్మాణాలపై తనిఖీలు కూడా కరువయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 137 ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. ఆ శాఖ సిబ్భందికి తోడుగా తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగంనుంచి వెయ్యి మంది ఈ దళంలో విధులు నిర్వహిస్తారు. ఈ టీంకోసంకొత్తగా 20 బస్సులు, ట్రక్కులు, బొలేరోలతో పాటు 40 వాటర్బోట్లు కొనుగోలు చేశారు. ఇటీవల హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభం సందర్భంగా 122 వాహనాలను కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి అందించారు. అయితే హైడ్రా నుంచి డిజాస్టర్ మేనేమెంట్ సేవలు మాత్రం ఇంకా ఆశించిన స్థాయిలో సాగడం లేదన్న విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి. వేసవి అగ్ని ప్రమాదాలతో పాటు పరిశ్రమలు, సంస్థలలో చెలరేగే ప్రమాదాలు.. ముంచుకొస్తున్న వర్షాకాలం వరదలు హైడ్రాకు సవాల్ విసురుతున్నాయి.
డీఆర్ఎఫ్ సిబ్బంది ఎక్కడ?
భారీ అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపం వంటి విపత్తులు సంభవించినప్పుడు ఎమర్జెన్సీ సహాయ చర్యలు చేపట్టడానికి తెలంగాణ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో దాదాపు 2వేల మంది సిబ్బందితో ఎస్డీఆర్ఎఫ్ దళాన్ని ఏర్పాటు చేశారు. అగ్నిమాపకశాఖలోని ఫైర్స్టేషన్లు ఎస్డీఆర్ఎఫ్ స్టేషన్లుగా మార్పు చెందాయి. పట్టణాలలో వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, భవనం కూలిపోవడం వంటి విపత్తుల సమయాల్లో సహాయ చర్యలపై శిక్షణ అందించారు. మంటలనే ఆర్పే పద్ధతులు, రెస్క్యూ మెథడ్స్, పట్టణ వరదలపై అవగాహన, భవనం కూలిపోవడం నుంచి ప్రజలను రక్షించడం, ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ విధానంలో భాగంగా సీపీఆర్, ప్రథమ శిక్షణ, యోగా వంటి వాటిపై అవగాహన కల్పించారు. అయితే ఆ వ్యవస్థ సేవలు ఎంతవరకు ఉపయోగపడ్డాయన్నది గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటన సందర్భంగా ప్రశ్నార్ధకమైంది. వారికి సరైన ఎక్యూప్ మెంట్లు లేకపోవడంతోనే ప్రమాదం తీవ్రత అధికమైందన్న ఆరోపణలు ఇక్కడ గమనార్హం. హైడ్రాలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కు 70క బృందాలు..3,500 వరకు సిబ్బంది ఉన్నారు. గతంలో పోలీసు ఉద్యోగాల భర్తీలో భాగంగా తక్కువ మార్కుల వల్ల పోలీస్ ఉద్యోగాలకు అర్హత కోల్పోయిన సుమారు 150 మందిని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) ద్వారా హైడ్రాలోకి తీసుకున్నారు. 1050 మంది వివిధ హోదాల్లోని పోలీస్, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాలకు చెందిన ఆఫీసర్లు, సిబ్బందిని హైడ్రాకు కేటాయించగా వారంతా ఎక్కడకు పోయారన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది.