Good News: రైతాంగానికి.. భారత వాతావరణ శాఖ శుభవార్త!

  • By: sr    news    Apr 15, 2025 6:45 PM IST
Good News: రైతాంగానికి.. భారత వాతావరణ శాఖ శుభవార్త!

విధాత: భారత వాతావరణ శాఖ దేశ ప్రజలు, రైతులకు తీపి కబురు చెప్పింది. దేశంలో ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షాలు సమృద్ధిగా పడుతాయని.. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు సాధారణం కంటే ఎక్కువగానే వర్షాపాతం నమోదవుతుందని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, కర్నాటకలోనూ సాధారణం కంటే ఎక్కువగానే ఉంటాయని చెప్పింది. వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం దేశ రైతులకు ఎంతో ఉపశమనం కలిగించనున్నది.

న్యూఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో 1971-2020 మధ్యకాలంలో దీర్ఘకాల సగటు 87 సెంటీమీటర్లు మాత్రమే ఉండేదని పేర్కొన్నారు. ఈసారి మొత్తం దీర్ఘకాల సగటు వర్షాపాతం 105శాతంగా ఉంటుందని ఐఎండీ చీఫ్‌ మృత్యుంజయ్‌ మోహపాత్ర వెల్లడించారు. భారత ఉపఖండంలో సాధారణం కంటే తక్కువ వర్షాపాతంతో సంబంధం ఉన్న ఎల్‌ నినో పరిస్థితులు ఈ సారి అభివృద్ధి చెందే అవకాశం లేదన్నారు.

నైరుతి రుతుపవనాలు భారత దేశ వ్యవసాయరంగానికి ఎంతో కీలకమైనవి. వ్యవసాయం దేశ జనాభాలో దాదాపు 42.3 శాతం మందికి జీవనోపాధి అందిస్తున్నది. అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థకు 18.2శాతం దోహదపడుతున్నది. ఇటీవల కాలంలో వర్షం కురిసే రోజులు తగ్గుతుండగా.. స్వల్ప వ్యవధిలో భారీ వర్షపాతం నమోదవుతోంది. దీంతో తరచూ కరువులు, వరదలు సంభవిస్తున్నాయని వాతావరణశాఖ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

మరోవైపు దేశంలో ఈ ఏడాది వాతావరణ పరిస్థితులపై ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ కూడా తాజాగా తన నివేదికను విడుదల చేసింది. రాబోయే ‘నైరుతి’ సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. మార్చి వరకు వాతావరణ పరిస్థితులు, పలు అంశాలను విశ్లేషించిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించింది. జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో దేశంలో సగటున 868.6 మి.మీ వర్షం కురుస్తుందని అంచనా వేస్తోంది. నైరుతి సీజన్‌ నెమ్మదిగా ప్రారంభమైనా మధ్యలో వర్షాలు వేగం పుంజుకోనున్నాయని పేర్కొంది. పశ్చిమ, దక్షిణ భారతదేశంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.