ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో ‘ప్రేమ పెళ్లి’.. యువతి అనుమానాస్పద మృతి

  • By: sr    news    Mar 17, 2025 8:43 PM IST
ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో ‘ప్రేమ పెళ్లి’.. యువతి అనుమానాస్పద మృతి
  • గుంటూరు యువకున్ని పెళ్లి చేసుకున్న వరంగల్ యువతి

  • తన బిడ్డను చంపేశారని యువతి కుటుంబసభ్యుల ఆందోళన

విధాత: ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో ‘ప్రేమ పెళ్లి’ జరిగిన కొద్దిరోజులకే యువతి అనుమానస్పద మృతిచెందిన సంఘటన వివాదాస్పదమైంది. వరంగల్ కు చెందిన గీతికను గుంటూరుకు చెందిన కొప్పుల సాయికుమార్ ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయం చేసుకున్నాడు. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరువురు పెళ్లి చేసుకోవాలని భావించారు. దీనికి అమ్మాయి కుటుంబానికి తెలియకుండా ప్లాన్ చేసుకున్నారు. ఆ యువతి సెప్టెంబర్ 24న హైదరాబాద్ బోయినపల్లి లో తమ బంధువుల ఫంక్షన్‌కు రాగా ఫ్యామిలీకి చెప్పకుండా అక్కడినుంచి వెళ్లిపోయింది ‌‌.

ఈ విషయం తెలియని యువతి తండ్రి జగదీశ్వర చారి, తల్లి గాయత్రి తీవ్ర ఆందోళనకు గురై బోయిన పల్లి పీయస్ లో ఫిర్యాదు చేశారు‌. మరుసటి రోజు యువతి గీతిక గుంటూరు వచ్చినట్లు గుంటూరు కు చెందిన ఉదయ్ అనే వ్యక్తి ఫోన్ చేసి అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కూతురు గీతికను ఇంస్టాగ్రామ్ లో పరిచయం చేసుకొని రీల్స్, ఫొటోస్ పెట్టి ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడని ఆరోపించారు. సాయి కుమార్ ను పెళ్లి చేసుకున్న తమ కూతురు గుంటూరులో కాపురం చేస్తుందని చెప్పారు.

అయితే సాయి కుమార్ తనను సరిగా చూడడం లేదని గంజాయికి బానిసై, తనను తీవ్రంగా కొడుతున్నాడని తమ కూతురు మార్చి 14వ తేదీ ఫోన్ చేసినట్లు తల్లిదండ్రులు చెప్పారు. అదే రోజు రాత్రి తమ కూతురు ఉరేసుకొని చనిపోయినట్లు సాయికుమార్ తల్లిదండ్రులు తెలియజేయడంతో గుంటూరు వచ్చామని వారు చెప్పారు. సాయి కుమారే తన కుమార్తెను ఉరివేసి చంపారని అబ్బాయి ఇంటి ముందు యువతి కుటుంబ సభ్యులు‌. ఆందోళనకు దిగారు. గతంలోను మరో ఇద్దరు అమ్మాయిలను సాయికుమార్ ట్రాప్ చేసాడని తల్లిదండ్రులు బంధువులు ఆరోపించారు. గీతిక ఉరి వేసుకోవడం పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గది వెనుక వైపు తలుపు తీసి ఉండడం యువతి శరీరం పై దెబ్బలు ఉండడంతో అనుమానం వచ్చి నల్లపాడు పీయస్ లో ఫిర్యాదు చేసినట్లు తల్లిదండ్రులు చెప్పారు. తమ కూతుర్ను మాయమాటలతో ట్రాప్ చేసి తీసుకొచ్చి ఉరివేసాడని విలపించారు, ఉరి వేసుకునేంత పిరికిది తమ బిడ్డ కాదని చెప్పారు. తమ కూతురు మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమ కూతురు ప్రస్తుతం మూడు నెలల గర్భవతిగా తెలిసినట్లు వారు వెల్లడించారు. చేతికి అంది వచ్చిన తమ కూతురిని చంపేశారని కన్నీరు మున్నీరయ్యారు.సాయికుమార్ జులాయిగా తిరిగేవాడని, గ్యాంగ్ మెయింటెన్‌ చేస్తూ ఉండేవాడని, ఉదయ్ అనే వ్యక్తి అతనికి సపోర్టుగా ఉన్నాడని ఆరోపించారు. ఈ మృతిపై పూర్తి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వేడుకొన్నారు. ఇదిలాఉండగా ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారిస్తున్నట్లు చెప్పారు.