David Warner: IPL వ‌ద్దంది.. టాలీవుడ్ కాసులు కురిపించింది! ఒక్క సీన్‌కు వార్న‌ర్‌కు అన్ని కోట్లా

  • By: sr    news    Mar 21, 2025 3:21 PM IST
David Warner: IPL వ‌ద్దంది.. టాలీవుడ్ కాసులు కురిపించింది! ఒక్క సీన్‌కు వార్న‌ర్‌కు అన్ని కోట్లా

David Warner | IPL | Robin Hood

విధాత: డేవిడ్ వార్నర్ (David Warner).. ఈ పేరు క్రికెట్ అభిమానులకు సుపరిచతమే. అందులోనూ తెలుగు వారికి మరి ఎక్కువ సన్నిహితం. ఐపీఎల్ (IPL)లో సన్ రైజర్స్ (Sun Risers) హైదరాబాద్ తరుపున ఆడిన డేవిడ్ వార్నర్‌కు తెలుగు అభిమానులు ఎక్కువ. అస్ట్రేలియా దేశానికి చెందిన వాడైనప్పటికి గతంలో తెలుగు సినిమాలు బాహుబలి.. పుష్ప వంటి సినిమాలకు పేరడి చేస్తూ కూడా తెలుగు వారికి మరింత దగ్గరయ్యాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటరైన వార్నర్ ఈసారి ఐపీఎల్‌లో అమ్ముడుపోని ఆట‌గాళ్ల‌లో ఒకడుగా మిగలాడం పెను విషాదమే. వార్న‌ర్ క‌నీస ధ‌ర రూ.2 కోట్ల‌కు కొన‌డానికి ఒక్క ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. ఎన్నో ధనాధన్ ఇన్నింగ్స్ లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన వార్నర్‌కు ఐపీఎల్‌లో అన్ సోల్డ్‌గా నిలువడం జీర్ణించుకోలేని చేదు నిజమే. అయితేనేం…తనను ఎప్పుడు ఆదరించే తెలుగు వారు మరోసారి వార్నర్‌ను కరుణించారు. అంటే సన్ రైజర్స్ క్రికెట్ టీమ్ ప్రాంచైజీ వారు కాదండోయ్.. ఈ దఫా తెలుగు సినిమా రంగం వారు వార్నర్‌ను ఆదుకున్నారు.

టాలీవుడ్ హీరో నితిన్ (Nithin) నటించిన ‘రాబిన్ హుడ్‌’ (Robin Hood )సినిమాలో వార్నర్ కు అవకాశమిచ్చారు. ఈ సినిమాలో వార్నర్ ఒకే ఒక్క సీన్‌లో న‌టించాడు. అందుకోసం ఆయనకు చిత్ర‌బృందం రూ.2.5 కోట్ల పారితోషికం ఇచ్చిందట. ఇంకేముంది ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐపీఎల్‌లో వార్న‌ర్ క‌నీస ధ‌ర రూ.2 కోట్ల‌కు కొన‌డానికి ఒక్క ఫ్రాంచైజీ కూడా ముందుకు రాకపోయినా..రాబిన్ హుడ్‌’లో ఒకే ఒక్క సీన్‌లో న‌టించినందుకు చిత్ర‌బృందం రూ.2.5 కోట్ల పారితోషికం ఇవ్వడం గొప్ప విషయని కామెంట్లు పెడుతున్నారు. క్రికెట్ వ్యాపారంలో అనేక విధాలుగా లాభాలు ఆర్జించే ఐపీఎల్ ఫ్రాంచైజీలతో పోలిస్తే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీదే పెద్ద మ‌న‌సు క‌దూ! అంటు అభినందిస్తున్నారు. రాబిన్ హుడ్ సినిమా కోసం డేవిడ్ భాయ్ సుమారు నాలుగు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

సినిమాలో ప్రమోషన్ చేసేందుకు కలిపి రూ.3కోట్లకు పైగానే వార్నర్‌కు ఇచ్చారని సమాచారం. ఎంతైనా మన వార్నర్ అదృష్ట వంతుడేనని.. ఒకవేళ ఐపీఎల్ లో ఏదైనా ఫ్రాంచైజీ కొనుగోలు చేసినా ఒళ్లంతా పులుసయ్యేలా పదుల సంఖ్యలో మ్యాచ్ లు ఆడాల్సి వచ్చేదని..తెలుగు సినీ పరిశ్రమ పుణ్యమా అని..ఒక్క సీన్ కే ఐపీఎల్ కంటే ఎక్కువ డబ్బులు సంపాదించేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నితిన్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా దర్శకుడు వెంకి కుడుముల తెరకెక్కించిన రాబిన్ హుడ్ చిత్రం ఈనెల 28న విడుదల కానుంది. ఎల్2 ఎంపురాన్, వీరధీరశూర పార్ట్ 2, మ్యాడ్ స్క్వేర్ తో పోటీ పడుతున్న రాబిన్ హుడ్ సినిమా వార్నర్ ఎంతమేరకు బాక్సాఫీస్ వద్ధ జోష్ తీసుకొస్తాడన్నది చూడాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన రాబిన్ హుడ్ సినిమాలోని కేతిక శర్మ స్పెషల్ సాంగ్ కు అభిమానుల్లో మంచి క్రేజ్ రావడం సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇదిలాఉండ‌గా డేవిడ్ వార్న‌ర్ గ‌తంలో తెలుగులో రాజ‌మౌళితో క‌లిసి బాహుబ‌లి స్పూఫ్‌ యాడ్‌లో న‌టించి మెప్పించిన సంగ‌తి తెలిసిందే.