జగన్ కు జైలా.. బెయిలా ? వైసీపీలో లబ్ డబ్..
విధాత:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ జైలుకు వెళతారా? సీబీఐ, ఈడీ కేసుల్లో ఆయన బెయిల్ రద్దు కానుందా? ఇదే ఇప్పుడు ఏపీలో ఉత్కంఠగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ పెట్టిస్తోంది. ఒక రకంగా జగన్ శిబిరంలో తీవ్ర ఆందోళన నెలకొంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ పై మంగళవారం విచారణ జరగనుంది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో జగన్‌తోపాటు సీబీఐ కూడా కౌంటర్ దాఖలు […]

విధాత:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ జైలుకు వెళతారా? సీబీఐ, ఈడీ కేసుల్లో ఆయన బెయిల్ రద్దు కానుందా? ఇదే ఇప్పుడు ఏపీలో ఉత్కంఠగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ పెట్టిస్తోంది. ఒక రకంగా జగన్ శిబిరంలో తీవ్ర ఆందోళన నెలకొంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ పై మంగళవారం విచారణ జరగనుంది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో జగన్‌తోపాటు సీబీఐ కూడా కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. లాక్‌డౌన్ పేరుతో జగన్ లాయర్, ఉన్నతాధికారుల అభిప్రాయం తెలుసుకోవాలంటూ సీబీఐ లాయర్ కౌంటర్ వేయకుండా గతంలో వాయిదా కోరారు. దీనిపై సీబీఐ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ… జూన్ 1లోపు కౌంటర్ వేయకుంటే, తామే పిటిషన్‌పై నేరుగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. దీంతో ఈసారి కౌంటర్ ఖచ్చితంగా దాఖలు చేయాల్సిందే. దీంతో జగన్ బెయిలును రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది? ‘ఔను… రద్దు చేయాలి!’ అంటుందా? లేక… ‘రద్దు చేయవద్దు.. బెయిలు నిబంధనలను ఆయన ఎంతమాత్రమూ ఉల్లంఘించడంలేదు’ అని చెబుతుందా? అన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
దర్యాప్తు సంస్థలు ఎక్కువగా నిందితుడికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటాయి. బెయిలు పిటిషన్లను వ్యతిరేకించడం, గరిష్ఠ శిక్ష విధించాలని కోరుతాయి. ఈ విధంగా చూస్తే… జగన్ బెయిలును రద్దు చేయాలని సీబీఐ కోరాలి. అదే జరిగితే… పెద్ద సంచలనమే. సీబీఐ ముందున్న మరో ‘ఆప్షన్’.. బెయిలు రద్దు చేయాల్సిన అవసరం లేదని చెప్పడం. ఇది ఒక దర్యాప్తు సంస్థగా సీబీఐ చేయకూడని పని. ఎందుకంటే… రఘురామరాజు తన పిటిషన్‌లో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరిస్తున్నారని.. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. పలువురు సాక్షులు జగన్ ప్రభుత్వంలో అధికారులుగా ఉండటం, కొందరు సహ నిందితులు కీలక స్థానాల్లో ఉండటం, ఒకరికి సలహాదారు పదవి ఇవ్వడం, విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు పంపడం లాంటివన్నీ పిటిషన్‌లో వివరించారు. ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను జీర్ణించుకోలేని వైసీపీ నేతలు న్యాయవ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఇంత నిర్దిష్టమైన అంశాలు ఉండటంతో జగన్ బెయిల్ పై ఎటువంటి నిర్ణయం ఉంటుందన్నది ఆసక్తిగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకెళ్లడం ఖాయం? ఆయన బెయిల్ రద్దు కాబోతోంది? అని కొంత కాలంగా ఏపీ బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారంలో, అంతకు ముందు కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్పారు. దీంతో ఏపీ బీజేపీ నేతలు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కమలనాధులు చెబుతున్నట్లే సీఎం జగన్ బెయిల్ రద్దు కాబోతోందా అన్న చర్చ జరుగుతోంది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై కేంద్రం వైఖరి ఎలా ఉండబోతోంది, సీబీఐ కౌంటర్ ఎలా వేయబోతుంది అన్న టెన్షన్ వైసీపీ నేతల్లో కనిపిస్తోంది.జగన్ అనుచరులకు నిద్ర లేకుండా చేస్తోంది. జగన్ బెయిల్ కేసులో జరగబోయే పరిణామాలపై ఏపీ జనాల్లోనూ ఉత్కంఠ నెలకొంది.