Godavari Floods | భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం..కృష్ణా ప్రాజెక్టుల గేట్ల ఎత్తివేత
గోదావరి వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు నడుస్తున్నాయి. భద్రాచలంలో హెచ్చరికలు జారీ కాగా, ఎగువ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత కొనసాగుతుంది.

Godavari Floods | విధాత : గోదావరి భద్రాచలం పుణ్యక్షేత్రం వద్ద ఉగ్రరూపం దాల్చింది. వరద ఉదృతితో భద్రాచలం వద్ధ ప్రస్తుతం నీటి మట్టం 51.40 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 53 అడుగులకు చేరితే చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరి ఉగ్రరూపంతో వరదల భయం నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. భద్రాచలం వద్ద కల్యాణ కట్ట ప్రాంతం వరకు వరద నీరు చేరింది. స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు నీటిలో మునిగిపోయాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గోదావరి నీరు పట్టణంలోకి రాకుండా అధికారులు గోదావరి కరకట్టకు ఉన్న స్లూయిజ్‌లను మూసివేశారు. దీంతో పట్టణం నుంచి మురుగునీరు బయటకు వెళ్లకపోవడంతో అధికారులు మోటార్లు ఏర్పాటు చేసి.. నీటిని తోడివేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్ల రన్నింగ్
గోదావరి నదికి వరదల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను ఏడు పంప్‌హౌస్‌లలో అధికారులు నడిపిస్తున్నారు. నంది, గాయత్రి, అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ పంప్‌హౌస్‌లలో మోటార్లు నడుస్తుండటంతో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి.
మరోవైపు ఏపీలోని ధవళేశ్వరం వద్ద 9.88 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవ్వగా .. అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఆనకట్ట వద్ద 11.9 అడుగుల నీటిమట్టం నమోదైంది. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
కృష్ణా ప్రాజెక్టులు ఫుల్…గేట్ల ఎత్తివేత
కృష్ణా నది వరద ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాజెక్టులు అన్ని పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరడంతో ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల సాగిస్తున్నారు. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి ప్రవాహాం పెరుగడంతో ప్రాజెక్టు 10గేట్లు 18అడుగుల మేరకు ఎత్తి 4లక్షల 18వేలకు పైగా క్యూసెక్కుల వరదను దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 4లక్షల 98 వేల క్యూసెక్కులు కాగా.. జలాశయం నుంచి 5 లక్షల 14 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,400 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 29,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.6 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.80 టీఎంసీలు కాగా..ప్రస్తుతం 197.01టీఎంసీలు నీటిమట్టం ఉంది.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్న భారీ వరదతో నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 3లక్షల 93,000 క్యూసెక్కులుగా కొనసాగుతుండగా.. అవుట్ ఫ్లో 4లక్షల74,000 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 583 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 291.65 టీఎంసీలుగా కొనసాగుతుంది.
నాగార్జు సాగర్ నుంచి వస్తున్న వరద ఉదృతి కారణంగా దిగువన పులిచింతల ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజ్ కూడా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో సముద్రంలోకి నీటిని వదులుతున్నారు. ఇక మెదక్ జిల్లాలో సింగూరు జలాశయం నుంచి నీటీ విడుదల కారణంగా ఎనిమిది రోజులుగా ఏడుపాయల వనదుర్గ ఆలయం జలదిగ్బంధంలో ఉంది. రాజగోపురంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహంతో భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు.
భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం
51 అడుగులకు చేరిన నీటిమట్టం
కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
53 అడుగులకు చేరితే చివరి ప్రమాద హెచ్చరిక జారీ
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు#Bhadrachalam #Godavari pic.twitter.com/mxN1GEhvlW
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 21, 2025