Kcr: కేసీఆర్, హరీశ్ రావు భేటీ.. చర్చంతా ఆ విషయం మీదే..

– మూడు గంటలపాటు సుదీర్ఘంగా మంతనాలు
– ఇంజినీర్లతో, అధికారులతో కేసీఆర్ చర్చలు
Kcr: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 5న కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరుకాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం తన ఫామ్ హౌస్ లో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. మాజీ మంత్రి హరీశ్ రావుతో దాదాపు మూడున్నరగంటల పైనే ఆయన చర్చలు జరిపారు.
కాళేశ్వరం కమిషన్ ఏం ప్రశ్నించబోతున్నది? తాను ఏం సమాధానం చెప్పాలి.. అన్న విషయంపై సుదీర్ఘంగా ఆయన చర్చించినట్టు సమాచారం. ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో హరీశ్ రావుతో భేటీ అయిన కేసీఆర్ పలువురు ఇంజినీర్లు, సీనియర్ అధికారులతోనూ ఫోన్ లో సంభాషించినట్టు తెలుస్తున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్డీఎస్ ఏ ఇచ్చిన నివేదికను సైతం కేసీఆర్ అధ్యయనం చేశారు. కమిషన్ ఏ కోణంలో విచారించబోతున్నది. గతంలో విచారణకు హాజరైన ఇంజినీర్లు, అధికారులు ఏం చెప్పారు.. ఆ సమాధానాల ఆధారంగా పీసీ ఘోష్ కమిషన్ తనను ఏయే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. తాను ఎలా వాటికి సమాధానం చెప్పాలి. అన్న అంశంపైనే కేసీఆర్ లోతుగా చర్చిస్తున్నట్టు తెలుస్తున్నది.
విజిలెన్స్ నివేదికలో ఏముంది.. ఎక్కడ లోపాలు జరిగాయి.. వంటి విషయాల మీద ఆయన పూర్తి స్థాయిలో ఆరా తీశారట. కమిషన్ ఎదుట హాజరైన అధికారులతోనూ కేసీఆర్ మాట్లాడారు. గతంలో కమిషన్ ఏ అంశాల మీద ఫోకస్ పెట్టింది. వారిని ఏం అడిగింది.. కమిషన్ ప్రశ్నలకు అధికారులు ఎటువంటి సమాధానాలు ఇచ్చారు. వంటి అంశాలపై కేసీఆర్ లోతుగా చర్చించినట్టు సమాచారం. మొత్తానికి త్వరలో విచారణకు హాజరవబోతున్న నేపథ్యంలో కేసీఆర్ అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారు.