బీజేపీ ఎజెండా మేరకే కేటీఆర్ మాటలు: అద్దంకి దయాకర్

  • By: sr    news    May 24, 2025 1:53 PM IST
బీజేపీ ఎజెండా మేరకే కేటీఆర్ మాటలు: అద్దంకి దయాకర్

విధాత, హైదరాబాద్ : బీజేపీ ఎజెండా మేరకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీట్ విషయమై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మాటలు బుడ్డర్ ఖాన్ మాటలను తలపిస్తున్నాయన్నారు. రేవంత్ రెడ్డిపైన ఈడీ కేసుపై బీజేపీ నాయకులకంటే ముందుగానే కేటీఆర్ మాట్లాడటమే ఆ రెండు పార్టీల కుమ్మక్కుకు నిదర్శనమన్నారు.కేటీఆర్ మాటలు బీజేపీ తొత్తుగా బీఆర్ఎస్ మారిందన్న వాస్తవాన్ని చాటుతుందన్నారు. అవినీతి గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం విడ్డూరమని..తెలంగాణను దొంగల దొడ్డిగా మార్చిన దొంగలు మీరని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి బీజేపీపై చేస్తున్న పోరాటంపై కనీస అవగాహాలేని సన్నాసి కేటీఆర్ అని దయాకర్ విమర్శించారు.

ముందు నీ చెల్లి కవిత నిన్ను దొంగ..దెయ్యం అంటూ బయటమాట్లాడుతుంటే దానికి సమాధానం చెప్పకుండా సీఎం రాజీనామా చేయాలంటూ మాట్లాడటం ఎందుకన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి.. వనరులను దోచుకుని…ఎన్నికల్లో ఎన్నిమాటలు చెప్పినా నమ్మకుండా.. మిమ్మల్ని ప్రజలు పాతాళానికి తొక్కినా ఇంకా నీ బుద్ది మారడం లేదన్నారు. కాళేశ్వరం అవినీతి కేసులో మీ నాన్న కేసీఆర్, బావా హరీష్ రావులు, ఫార్ములా రేసు కేసులో నీవు..పదేళ్లలో వేలకోట్లు దోచుకున్న సంగతి మరిచి కాంగ్రెస్ పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ముందుగా నీ ఇల్లు చక్కబెట్టుకోవాలని..మీ ఇంట్లో పార్టీలో, కుటుంబంలో తలెత్తిన సమస్యలు పరిష్కరించుకోవాలని ఎద్దేవా చేశారు.

మీ అంతర్గత కలహాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్, రాహుల్, సోనియాగాంధీలపై విమర్శలు చేస్తున్నావని ఆరోపించారు. బీజేపీ రాజకీయ ఎత్తుగడలలో మీరు చిత్తయి..మోదీ వద్ధ మోకరిల్లి..వారి ఎజెండాను మీరు మోస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని..మీరేదో తెలంగాణను ఉద్దరించారని ప్రజలు అనుకోవడం లేదని దయాకర్ అన్నారు. బీజేపీ ప్రతిపక్షాలపై కేసులు ఎందుకు పెడుతుందో ప్రజలకు తెలుసని..రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి, సోనియా, రాహుల్ గాంధీలపైన పెట్టిన నేషనల్ హెరాల్డ్ కేసులపై ప్రజలకు అవగాహాన ఉందన్నారు. రేవంత్ రెడ్డికి మీరు..బీజేపీ నాయకులు పెట్టిన కేసులను ఎదుర్కోని పోరాడే శక్తి ఉందని స్పష్టం చేశారు.