Malli Pelli | విధాత: ‘మళ్ళీ పెళ్లి’ అనగానే అప్పట్లో తనికెళ్ల భరణి.. ఇప్పట్లో అయితే టక్కున గుర్తుకొచ్చే జంట నరేష్, పవిత్రా లోకేష్. ‘చెల్లికి పెళ్లి.. జరగాలి మళ్ళీ మళ్ళీ’ అని తనికెళ్ల భరణి అంటే.. తిట్టిన తిట్టు తిట్టకుండా ఉత్తరాలు పంపిస్తారు జనాలు. సేమ్ టు సేమ్ ఇప్పుడు నరేష్, పవిత్రల విషయంలోనూ అదే జరుగుతుంది. వారి రచ్చ ముందు కుర్ర హీరోల రచ్చ కూడా సరిపోదు. ఆ ప్రేమాయణంతో వీళ్ళు చేసినంతగా మరెవరూ […]
Malli Pelli |
విధాత: ‘మళ్ళీ పెళ్లి’ అనగానే అప్పట్లో తనికెళ్ల భరణి.. ఇప్పట్లో అయితే టక్కున గుర్తుకొచ్చే జంట నరేష్, పవిత్రా లోకేష్. ‘చెల్లికి పెళ్లి.. జరగాలి మళ్ళీ మళ్ళీ’ అని తనికెళ్ల భరణి అంటే.. తిట్టిన తిట్టు తిట్టకుండా ఉత్తరాలు పంపిస్తారు జనాలు. సేమ్ టు సేమ్ ఇప్పుడు నరేష్, పవిత్రల విషయంలోనూ అదే జరుగుతుంది. వారి రచ్చ ముందు కుర్ర హీరోల రచ్చ కూడా సరిపోదు. ఆ ప్రేమాయణంతో వీళ్ళు చేసినంతగా మరెవరూ ఇంత క్రేజ్ సంపాదించుకోలేదేమో కూడా.
తన జీవితంలోని చాలా అంశాలను తెర మీదకు తెచ్చి, పాత్రలతో సినిమా తీసి మరీ రచ్చ చేసుకున్నాడు నరేష్. ‘మళ్ళీ పెళ్లి’ చిత్రంలో వాళ్ళ పాత్రలను వాళ్ళే పోషించడమే కాకుండా పవిత్రా లోకేష్‌ని పెళ్ళి చేసుకున్నట్టుగా ఓ టీజర్‌ని విడుదల చేసి మరీ జనాల్లో క్రేజ్ కొట్టేశాడు.
ఇదేంటి మూడో భార్యకు విడాకులు ఇవ్వకుండానే మళ్ళీ పెళ్లి ఎలా చేసుకుంటాడని తెగ ఆతృతగా ఎదురు చూసిన ప్రేక్షకులకు, యావత్ ప్రజా లోకానికి తన సంసార సరిగమలనే సినిమాగా తెరకెక్కించాడు. ముఖ్యంగా సినిమాలో అతి ఆత్రం, చవకబారు తెలివి తేటలను, మూడో భార్య రమ్య రఘుపతి మీద ఉన్న కోపాన్ని, కక్షను మాత్రమే చూపించడానికి ఆ సినిమా తీశాడని తెలిసి చాలా మంది ముక్కు మీద వేలేసుకున్నారు.
ఇదేంటి ఎంత డబ్బుంటే మాత్రం ఇంత చీప్‌గా ప్రవర్తించాడన్నవారూ లేకపోలేదు. సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల వారసుడిగా సినీ కెరియర్ ప్రారంభించి కాసిన్ని మంచి సినిమాలు చేశాడు నరేష్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ మంచిపేరే తెచ్చుకున్నాడు.
అయితే ఈమధ్యకాలంలో నరేష్, పవిత్రా లోకేష్ మధ్య ఏదో వ్యవహారం నడుస్తున్నదనే గుసగుసలు వినిపించడం దగ్గర నుంచి, బెంగుళూరులో ఓ హోటల్లో ఇద్దరినీ మూడో భార్య రమ్యా రఘపతి రెడ్ హేండెడ్‌గా పట్టుకునే వరకూ వచ్చాక కానీ.. ఇద్దరి మధ్య సాగుతున్న కథ జనాల వరకూ రాలేదు.
అయితే ఇదంతా రూపాయికి ఓ సైడ్ అయితే తనకు పవిత్రా లోకేష్‌కు మధ్య ఉన్నది నిజమని చెబుతూ న్యూ ఇయర్‌కి రిలీజ్ చేసిన ముద్దుల గ్లింప్స్ మరో సంచలనమై కూచుంది. ఇక అప్పటి నుంచి మళ్ళీ పెళ్లి టీజర్, ట్రైలర్ అన్నీ సంచలనాలే.. అందులో టీజర్ ఆఖరున ఇద్దరి కళ్ళ సైగలు మరో లెవెల్..
ఇక ఇదంతా జనాల్లోకి సినిమాను సక్సెస్ ఫుల్ గా తీసుకుపోవడానికి వేసిన ప్లాన్ అనే చెప్పాలి. నిజ జీవిత సంఘటనలనే తెరకెక్కించి మూడో భార్యను విలన్‌గా నిరూపిస్తూ చేసిన ప్రయత్నంలో నరేష్ వరకూ ఓకే కానీ.. రమ్యా రఘపతి మాత్రం తనను కించపరిచేట్టూ ఈ సినిమా నిర్మాణం జరిగిందని కోర్టులో కేస్ వేసింది.
సినిమా రిలీజ్‌ను ఆపలేకపోయినా ఓటీటీలో ఈ సినిమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. సినిమా పరాజయం పొందినా తనను బ్యాడ్ చేసిన నరేష్ పవిత్రలపై ఎలాగన్నా కక్ష తీర్చుకోవాలని, వాళ్లను కోర్టుల చుట్టూ తిప్పేదాకా రమ్యా రఘపతి ఊరుకునేట్టు కనిపించడం లేదు. చూడాలి ఈ కథ ఎటు కంచికి చేరనుందో.. ఎవరు రాజీ పడతారో, ఎవరు పేచీ పడతారో..ఈ ట్రయాంగిల్ కథకు కాలమే సమాధానం చెప్పాలి.