MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ!

ఏపీలో ఎన్నికలు జరిగే ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ తీవ్ర పోటీ ఉంది. ఇక్కడ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి 11 ఎమ్మెల్యే స్థానాలున్నందున పోటీకి అవకాశం లేదు. ఇక ఐదు స్థానాల్లోనూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్ధులు పోటీ చేయనున్నారు. ఈ ఐదు స్థానాల్లో కూటమిలోని మూడు పార్టీలకు ఎన్నెన్ని స్థానాలు లభిస్తాయనేది ఇప్పుడు ఉత్కంటగా మారింది.

  • By: sr    news    Mar 05, 2025 7:19 PM IST
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ!
  • ప్రధాన రాజకీయ పక్షాల్లో అంతర్గత పోటీ
  • గాఢ్ ఫాదర్ లను నమ్ముకున్న నాయకులు
  • నామినేషన్లకు ఈ నెల 10వతేదీ ఆఖరు రోజు
  • ఈ నెల 20న ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్

రవి సంగోజు, విధాత ప్రత్యేక ప్రతినిధి:

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆశావహులు కక్కలేని మింగలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నెల 10వ తేదీన నామినేషన్లకు ఆఖరు రోజు కావడంవల్ల అభ్యర్ధుల ఎంపికకు కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎంతో కాలంగా పార్టీలను నమ్ముకుని పనిచేస్తున్నప్పటికీ అంతర్గతంగా నెలకొన్న పోటీ కారణంగా తమకు వస్తుందనుకున్న పోటీ అవకాశం చివరి నిమిషంలో దక్కుతుందా? లేదో అనే ఆందోళనతో ఆశావహులు కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా పోటీ చేసే ఛాన్సు ఎవరికి లభిస్తుందోననే చర్చ ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, జనసేన, బీజేపీ వర్గాల్లో నెలకొంది. ఆయా పార్టీల అధిష్టానం నిర్ణయం ఎలా ఉన్నా ప్రస్తుతానికి తమ గాఢ్ ఫాదర్ల పైన్నే ఎక్కువ ఆధారపడుతున్నారు. వారి ఆశీస్సులు పొంది తద్వారా అధిష్టానం దృష్టిలో పడేందుకు ఉన్న అన్ని మార్గాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. స్థానాలు తక్కువగా ఉండగా ఆశావహులు భారీ సంఖ్యలో ఉన్నందున చివరి వరకు అవకాశం ఎవరిని వరిస్తుందోననే ఆందోళన మాత్రం అన్ని పక్షాల ఆశావహుల్లో నెలకొంది.

ఏపీ, తెలంగాణలో కలిపి పది స్థానాలకు ఎన్నిక

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కలిపి పది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో ఐదు, ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. తెలంగాణలో ఐదుగురు ఎమ్మెల్సీలు ఎం.డీ మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, యెగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హసన్ ల కాలపరిమితి ముగిసింది. ఇందులో యెగ్గె మల్లేశం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీలో జంగా కృష్ణమూర్తి, దువ్వారాపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, బి. తిరుమల నాయుడు, యనమల రామకృష్ణుడు ల కాలపరిమితి ముగిసింది. ఈ పది స్థానాలకు ఈ నెల 3వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది.ఈ నెల పదవతేదీ నామినేషన్లు దాఖలుకు చివరి రోజు, ఇంకా ఐదు రోజులు మాత్రమే అభ్యర్ధుల ఎంపికకు సమయం ఉంది. ఈ నెల 20వ తేదీన పోలింగ్ నిర్వహించి తదుపరి ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల ఆశావహ అభ్యర్ధుల్లో తీవ్ర ఉత్కంట కనిపిస్తోంది. పార్టీల అధిష్టానం ఎవరికి ఛాన్సు కల్పిస్తారనే చర్చ సాగుతోంది.

అభ్యర్ధిత్వంపై కాంగ్రెస్ లో తీవ్ర పోటీ

తెలంగాణలోని ఐదు స్థానాలకు గానూ ఎమ్మెల్యేల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే నాలుగుస్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి, ఒక స్థానంలో బీఆర్ఎస్ కు గెలిచే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీల్లోనూ తీవ్రమైన పోటీ ఉంది. పదేండ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందున ఆశావహుల సంఖ్య విపరీతంగా ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో టికెట్ ఆశించి భంగపడ్డవారున్నారు. ఇంకా అనేక మంది పదేండ్లు ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోటీ నుంచి తప్పించేందుకు పార్టీ నాయకత్వం నామినేటెడ్ పదవులు, రాజ్యసభ, ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామంటూ హామీ ఇచ్చి ఒప్పించారు. వీరంతా ఏడాదిన్నర కాలంగా పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ముందుగా కొందరికి రాజ్యసభ అవకాశం కల్పించారు. తదుపరి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. మరికొందరిని సలహాదారులుగా, కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమించారు. సంఖ్య రీత్యా ఆశావహుల మధ్య తీవ్ర పోటీ ఉంది.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక కాంగ్రెస్ కు కత్తిమీద సాముగా చెప్పవచ్చు. ఐదు స్థానాల్లో తమకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేసుకున్న ఒప్పందం మేరకు ఒక స్థానం కేటాయించాలంటూ మిత్రపక్షమైన సీపీఐ ఆ పార్టీపై ఒత్తిడి తెస్తున్నది. ఇప్పటికీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను సీపీఐ నేతల బృందం కలిసింది. నాలుగు స్థానాలకుగానూ కాంగ్రెస్ లో వివిధ సామాజికవర్గాల సమతుల్యత పాటిస్తూ సీనియర్ లకు అవకాశం కల్పించడం అగ్నిపరీక్షగా మారింది. తాజాగా కులగణన చేపట్టిన నేపథ్యంలో బీసీల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. మంత్రివర్గంలో కూడా బీసీలకు సముచిత స్థానం దక్కలేదని కాంగ్రెస్ వర్గాలతో పాటు, విపక్షాల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇదిలాఉండగా కాంగ్రెస్ నుంచి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్, కుసుమకుమార్, యెగ్గె మల్లేశంతో పాటు మొన్నటి ఎన్నికల్లో ఒటమిపాలైన సంపత్ కుమార్, షబ్బీర్ అలీ, దొమ్మాటి సాంబయ్యతోపాటు పలువురు నాయకులున్నారు. ఇందులో పలువురు నాయకులు అధిష్టానంతో నేరుగా పరిచయం ఉన్న వారు, గతంలో హామీ లభించిన వారు, పార్టీ కోసం పనిచేసిన వారున్నారు. అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందనే ఉత్కంట నెలకొంది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినందున వ్యూహాత్మకంగా ఐదవస్థానానికి పోటీచేస్తుందా? అనే చర్చ సాగుతోంది.

బీఆర్ఎస్ కు ఒకే ఒక్క స్థానం

బీఆర్ఎస్ కు ఒక్క స్థానం దక్కనున్న నేపథ్యంలో ఆ పార్టీలోనూ తీవ్రమైన పోటీ ఉంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అయినందున చాలా మంది టికెట్ ఆశిస్తున్నా పైకి చెప్పలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాలపరిమితి అయిపోయిన వారిలో మైనార్టీ కోటా నుంచి మహమూద్ అలీ, ఎస్టీ కోటా నుంచి సత్యవతి రాథోడ్ తో పాటు శేరి సుభాష్ రెడ్డి తిరిగి టికెట్ ఆశిస్తున్నారు. ఇక ప్రతీ సారి ఆశాభంగానికి గురవుతున్న దాసోజు శ్రావణ్ బీసీ కోటా నుంచి ఈసారి ఎంతో ఆశతో ఉన్నారు. వీరితో పాటు ఆర్ ఎస్ ప్రవీణ్, నారదాసు తదితర నాయకులు టికెట్ ఆశిస్తున్నారు. ఈ మధ్యనే సత్యవతి రాథోడ్ ను మండలి విప్ గా ఆ పార్టీ నియమించింది. పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, కవిత ఎవరిని ప్రతిపాదిస్తారనే పరిస్థితి ఉంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీని, పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇరుకునపెట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ నుంచి విప్ జారీ చేసే అవకాశం ఉందంటున్నారు.

ఏపీ కూటమిలోనూ తీవ్రమైన పోటీ

ఏపీలో ఎన్నికలు జరిగే ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ తీవ్ర పోటీ ఉంది. ఇక్కడ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి 11 ఎమ్మెల్యే స్థానాలున్నందున పోటీకి అవకాశం లేదు. ఇక ఐదు స్థానాల్లోనూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్ధులు పోటీ చేయనున్నారు. ఈ ఐదు స్థానాల్లో కూటమిలోని మూడు పార్టీలకు ఎన్నెన్ని స్థానాలు లభిస్తాయనేది ఇప్పుడు ఉత్కంటగా మారింది. జనసేన నుంచి ఈ సారి నాగబాబుకు సీటు గ్యారంటీ అనుకుంటున్నారు. మిగిలిన నాలుగు స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి గట్టి పోటీ ఉంది. కాలపరిమితి ముగిసిన యనమల లాంటి వారితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు సందర్భంగా పోటీకి అవకాశం లేని వారు చాలా మంది ఎమ్మెల్సీ స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. ఏపీలో కూడా తీవ్ర పోటీ ఉన్నప్పటికీ ఎవరికి అవకాశం లభిస్తుందో చివరి వరకు చెప్పలేని పరిస్థితి ఉంది.