Libya | లిబియాలో 5000 మంది జల సమాధి..!
Libya ప్రజలకు శాపంగా మారిన అంతర్యుద్ధం ముందు జాగ్రత్తలు తీసుకోని ఫలితం.. విధాత: లిబియా (Libya) లోని ఓడరేవు నగరం డెర్నా జల ప్రళయానికి విలవిలలాడుతోంది. డానియల్ తుపాను ప్రభావంతో ఆకాశానికి చిల్లులు పడినట్లు వర్షాలు కురవడంతో రెండు డ్యాంలు బద్దలై నీరు సునామీలా ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ వరద నీటితో పాటు 5000 మందికి పైగా ప్రజలు సముద్రంలోకి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. పులి మీద పుట్రలా ఈ […]

Libya
- ప్రజలకు శాపంగా మారిన అంతర్యుద్ధం
- ముందు జాగ్రత్తలు తీసుకోని ఫలితం..
విధాత: లిబియా (Libya) లోని ఓడరేవు నగరం డెర్నా జల ప్రళయానికి విలవిలలాడుతోంది. డానియల్ తుపాను ప్రభావంతో ఆకాశానికి చిల్లులు పడినట్లు వర్షాలు కురవడంతో రెండు డ్యాంలు బద్దలై నీరు సునామీలా ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ వరద నీటితో పాటు 5000 మందికి పైగా ప్రజలు సముద్రంలోకి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. పులి మీద పుట్రలా ఈ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల సహాయక చర్యలు మందకొడిగా సాగుతున్నాయి.
దశాబ్ద కాలంగా రాజకీయ అస్థిరతతో సతమతమవుతున్న లిబియా.. ఇలాంటి విపత్తులను తట్టుకునే స్థితిలో లేదు. ప్రస్తుతం అక్కడ రెండు ప్రత్యర్థి గ్రూపులు అధికారాన్ని చెలాయిస్తుండటంతో సహాయక చర్యల్లో సమన్వయం కొరవడింది. చమురు నిల్వలతో లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ మౌలిక వసతులను ఆధునికీకరించకపోవడం ఇక్కడి ప్రజలకు శాపంగా మారింది.
ఒక్క డెర్నా నగరంలోనే 5000 మందికి పైగా చనిపోయినట్లు అంచనాలు వస్తుండగా.. దేశ తూర్పు ప్రదేశాలైన సహ్హత్, అల్ బైదా, మర్జ్ నగరాల్లోనూ మరికొన్ని మరణాలు చోటు చేసుకునే అవకాశముంది. ఈ నగరాల నుంచి కనీసం 20 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ప్రస్తుతం ఈ ప్రాంతాలన్నీ తేలియాడుతున్న శవాలు, మునిగిపోయిన కార్లు, నివాసాల మొండిగోడలతో కనిపిస్తున్నాయి.
మరో ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోలో భారీ భూకంపం వచ్చిన రోజుల వ్యవధిలోనే లిబియాలో వరదలు ముంచెత్తడంపై పలు చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ రెండు ఘటనలూ వేర్వేరని లిబియా పాలసీ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన ఎల్ గోమాటీ అనే ప్రొఫెసర్ వెల్లడించారు. మొరాకోలో వచ్చిన భూకంపాన్ని ముందుగా గుర్తించలేమని.. కానీ లిబియాలో వచ్చిన తుపాను గుర్తించి జాగ్రత్తలు తీసుకునే అవకాశమున్నా విఫలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తుపాను వస్తూ వస్తూ గ్రీస్, తుర్కియే, బల్గేరియా దేశాల్లో విపత్తును సృష్టించినా లిబియా యంత్రాంగం అప్రమత్తమవలేదని తెలిపారు.