PM Modi: 1947లో జరిగిన ఆ తప్పువల్లే టెర్రరిజం పెరిగింది

– దేశ విభజన సమయంలోనే ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాల్సింది
– పటేల్ సూచనను ఆ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు
– నెహ్రూ నిర్ణయాల వల్లే భారత్ కొంత భూభాగాన్ని కోల్పోయింది
– పాకిస్థాన్ ఉగ్రవాదులను కావాలనే పెంచి పోషిస్తున్నది
– గుజరాత్ లోని ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కామెంట్లు
PM Modi: భారత ప్రభుత్వం 1947లో చేసిన ఓ తప్పు వల్లే ఉగ్రవాదం పెరిగిపోయిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశ విభజన సమయంలోనే పాకిస్థాన్ ఉగ్రవాదులను భారత్ మీదకు ఉసి గొల్పిందని చెప్పారు. అప్పట్లో భారత్ మీద ఉగ్రవాదులు చేసిన దాడులను సమర్థంగా ఎదుర్కొని ఉంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ పరిధిలోనే ఉండేదని చెప్పారు.
అప్పటి ఉగ్రదాడి సమయంలో సైనిక చర్య చేపడతామని సర్దార్ వల్లభభాయి పటేల్ సూచించారని.. కానీ అందుకు నెహ్రూ ఒప్పుకోకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. నెహ్రూ ఆరోజు పటేల్ మాట విని ఉంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ పరిధిలోనే ఉండేదని చెప్పారు.
తొలి దాడిపై స్పందించలేదు..
1947లో పాకిస్తాన్ నుంచి తొలి దాడి జరిగిన సమయంలోనే సైన్యాన్ని రంగంలోకి దింపాలని అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సూచనను తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పట్టించుకోలేదని మోదీ ఆరోపించారు. ఒకవేళ ఆనాడు సర్ధార్ పటేల్ సూచన మేరకు భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై ఎదురుదాడి చేసి ఉంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అనే సమస్య, ఉగ్రవాద సమస్య సైతం భారత్‌కు తప్పేదని పేర్కొన్నారు. 1947లోనే స్వాతంత్య్రం వచ్చిన రాత్రే కశ్మీర్ పై ఉగ్రదాడి జరిగింది. పాకిస్తాన్ ‘ముజాహిదీన్’ పేరుతో బలవంతంగా ఈ ప్రదేశాన్ని ఆక్రమించుకున్నదని అయితే సైనిక చర్యకు ఆదేశించకపోవడంతో పాకిస్థాన్ నేటికి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నదని మోదీ ఆరోపించారు.
గత 75 ఏండ్లుగా ఉగ్రవాదుల రక్తపాతం కొనసాగుతూనే ఉందని చెప్పారు. భారత్ తో నేరుగా యుద్ధం చేస్తే గెలవలేమని భావించిన పాకిస్థాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ పరోక్ష యుద్ధం చేస్తున్నదని చెప్పారు.