Telugu Film Chamber Of Commerce: టీఎఫ్‌సీసీ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా

Telugu Film Chamber Of Commerce: టీఎఫ్‌సీసీ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోనే ఆయన పదవిని వదులుకోవడం గమనార్హం. తన ప్రమేయం లేకుండానే ప్రకటనలు వస్తున్నాయని.. అటువంటి ప్రకటనలకు తాను ఎలా బాధ్యుడిని అవుతానంటూ ఆయన పేర్కొన్నారు.
ఇటువంటి పరిస్థితుల దృష్ట్యా తాను ఈ పదవిని చేపట్టలేనని స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో టీఎఫ్‌సీసీకి కొత్తగా ఎన్నికైన పాలక మండలిని ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడోసారి అధ్యక్షుడిగా సునీల్ నారంగ్, కార్యదర్శిగా శ్రీధర్ సహా 15 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. థియేటర్ల వ్యవహారంలో ఆ నలుగురు ఎవరూ లేరని, యజమానుల వద్దే వారి థియేటర్లు ఉన్నాయని పేర్కొన్నారు. హీరోలు దేవుళ్లు లాంటి వారని, వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాతలు చేయరని వ్యాఖ్యానించారు.