IPE – 2025 RESULTS | తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు.. అమ్మాయిలే టాప్!

  • By: sr    news    Apr 22, 2025 2:41 PM IST
IPE – 2025 RESULTS | తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు.. అమ్మాయిలే టాప్!

విధాత: తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్‌లో 66.89 శాతం, సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం పెరిగిందని భట్టి చెప్పారు.

ఈ ఏడాది ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలు 73.8 శాతం, బాలురు 57.83శాతం, ఇంటర్ సెకండియర్‌లో బాలికలు 74.21శాతం, బాలురు 57.31శాతం ఉతీర్ణత సాధించారని వెల్లడించారు. మే 22 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని.. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఇంటర్ బోర్డు వారం గడువు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పాసైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు.

విద్యార్థులు తమ ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ www.tgbie.cgg.gov.in లో చూసుకోవచ్చని బోర్డు అధికారులు తెలిపారు. అలాగే ఈసారి ప్రతీ విద్యార్థి మొబైల్‌ ఫోన్‌కు ఫలితాల లింక్‌ పంపనున్నట్లు వెల్లడించారు. లింక్‌పై క్లిక్‌ చేసి హాల్‌ టికెట్‌ వివరాలు నమోదు చేసి ఫలితాలు పొందవచ్చని చెప్పారు. గతంలో సర్వర్‌ డౌన్‌ లాంటి సమస్యలు ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈసారి అలాంటి సాంకేతిక సమస్యలు ఎదురవకుండా సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) ప్రత్యేక చర్యలు తీసుకుందని తెలిపారు.

విద్యార్ధుల ఫిర్యాదుల కోసం 92402 05555టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇంటర్ విద్యా కార్యదర్శి కృష్ణ ఆదిత్య, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు మొత్తం 9,96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు.. 5 లక్షలకుపైగా సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. ఈసారి గ్రేడ్లకు బదులు మార్కులను ఇస్తున్నట్లు ఇప్పటికే ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. మే 22నుంచి అడ్వాన్స్ డ్ పరీక్షలు నిర్వహించనున్నారు. రీకౌంటింగ్, వెరిఫికేషన్ల వారం గడువును ప్రకటించింది.